బతుకుబాటలో బలి | - | Sakshi
Sakshi News home page

బతుకుబాటలో బలి

Jul 10 2026 7:22 AM | Updated on Jul 10 2026 7:22 AM

వేములవాడఅర్బన్‌: బతుకుదెరువు వెతుక్కుంటూ వచ్చిన వలసజీవి ఊపిరి ఆగిపోయింది. తోటి కూలీలతో కలిసి నాట్లు వేసి వస్తుండగా మృత్యువు రూపంలో వచ్చిన ఆర్టీసీ బస్సు ఓ కూలి నిండు ప్రాణాలను బలిగొంది. అప్పటి వరకు అందరితో కలిసి ఆడుతూ.. పాడుతూ పని చేసిన వ్యక్తి రోడ్డుపై రక్తపు మడుగులో విగతజీవిగా పడిపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు, బాధితులు, స్థానికులు తెలిపిన వివరాలు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లా పౌర్ణ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు ఈనెల 5న బోయినపల్లి మండలం జగ్గారావుపల్లెకు వచ్చారు. గురువారం ఉదయం తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్‌లో వరినాటు వేసేందుకు 23 మంది కూలీలు టాటా ఏస్‌ వాహనంలో వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా వేములవాడ మండలం అనుపురం స్టేజీ వద్ద వీరి వాహనాన్ని వెనుక నుంచి సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొట్టింది. బస్సు వేగంగా ఢీకొట్టడంతో ఆటో రోడ్డు కిందకు పల్టీలు కొట్టింది. ఈ సంఘటనలో వాసుదేవ్‌ అతుల్‌(35) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో 17 మంది మహిళలు, మిగతా ఆరుగురు పురుషులు, డ్రైవర్‌ ఉన్నారు. గాయపడ్డ వారిలో వేములవాడ ఏరియా ఆస్పత్రికి 13 మందిని, సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి 8 మందిని 108లో తరలించారు. తీవ్రంగా గాయపడ్డ అర్చన, రంజి ప్రభాకర్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

మిన్నంటిన రోదనలు

ఆర్టీసీ బస్సు ఏటా ఏస్‌ వాహనాన్ని ఢీకొట్టగా.. ఆటో ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనదారుడు నిమ్మపల్లికి చెందిన గంగాధర్‌ గాయపడ్డాడు. సంఘటన స్థలంలో వలస కూలీలు రోడ్డుపై పడిపోవడంతో వాతావరణం భీతావహంగా మారింది. క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని ఎస్పీ మహేశ్‌ బీ గీతే, వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, టౌన్‌ సీఐ వీరప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.

మెరుగైన వైద్యం అందించాలి

సిరిసిల్లటౌన్‌/వేములవాడఅర్బన్‌: క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ వైద్యాధికారులను ఆదేశించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేములవాడ, సిరిసిల్ల ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎస్పీ మహేశ్‌ బీ గీతేతో కలిసి పరామర్శించారు. వైద్యాధికారులు, ఆస్పత్రి సూపరింటెండెంట్లతో మాట్లాడి బాధితులకు అత్యవసర వైద్యసేవలు అందేలా చూడాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపడతామన్నారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, గడ్డం నర్సయ్య, ఆర్‌ఎంవో డాక్టర్‌ సుమన్‌ మోహన్‌రావు తదితరులున్నారు.

ఉపాధి వెతుక్కుంటూ జిల్లాకు వచ్చిన వలస కూలీలు

నాట్లు వేసి వస్తుండగా వెనుక నుంచి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

టాటా ఏస్‌ వాహనంలో 23 మంది కూలీలు

ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

పరామర్శించిన విప్‌ ఆది శ్రీనివాస్‌, ఎస్పీ మహేశ్‌ బీ గీతే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement