● మూలవాగు, కట్టుకాలువ తీరంలో యథేచ్ఛగా నిర్మాణాలు
● కొన్నింటిని కూల్చినా.. మరికొన్ని యథాతథం
● ‘మామూలు’గా తీసుకుంటున్న అధికారులు
ఇది కోనాయపల్లి నుంచి వేములవాడ మూలవాగులోకి వచ్చే కట్టుకాలువ. ఈ కాలువ ఒడ్డున
నిర్మించిన భవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రియల్టర్లు కొందరు ప్రజాప్రతినిధులకు,
అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి పనులకు అనుమతినిచ్చినట్లు చర్చ సాగుతోంది.
వేములవాడ:ఆధ్యాత్మిక క్షేత్రంలో అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. వేములవాడలోని మూలవాగు, కట్టుకాలువల తీరంలో నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తున్నారు. ఇదంతా అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఆరోపణల వెల్లువ
గతంలో మూలవాగు ఒడ్డున నిర్మించిన అక్రమ భవనాలను జిల్లా అధికారులు కూల్చివేశారు. కొన్నింటిని పాక్షికంగా ధ్వంసం చేసినా మరికొన్ని భవనాల యజమానులు కోర్టును ఆశ్రయించడంతో అక్కడితోనే కూల్చివేతలు ఆగిపోయాయి. కోనాయపల్లి నుంచి వేములవాడ మూలవాగులో కలిసే కట్టుకాలువను ఆనుకుని ఉన్న బఫర్‌జోన్‌లోనూ బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. అధికారుల అలసత్వం వెనుక ‘మామూళ్ల’ హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మౌనం వెనుక మతలబేమిటి?
జిల్లా అధికారులు కొన్ని రోజుల క్రితం కూల్చివేతలు ప్రారంభించినా, అవి ‘కంటితుడుపు’ చర్యలుగానే మిగిలిపోయాయి. కోర్టు పరిధిలో ఉన్నాయనే సాకుతో అధికారులు కొన్ని భవనాలపై మౌనం వహిస్తుండడం వెనుక అధికారుల మామూళ్ల వ్యవహారం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బఫర్‌జోన్‌లో నిర్మాణాలకు ఎలా అనుమతులు లభించాయనే అంశంపై సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
బఫర్‌జోన్‌లో భనాలు నిర్మిచినట్లు ఫిర్యాదులు అందితే చర్యలు తీసుకుంటాం. ఇటీవల బైపాస్‌రోడ్డులో ఓ ప్రహరీ కాలువ ఒడ్డున నిర్మించడంతో మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో కూల్చివేశాం. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు చేయాలని కోరుతున్నాం.
– అభినవ్, టౌన్ ప్లానింగ్ అధికారి, వేములవాడ


