గొల్లపల్లి: ప్రజలు, విద్యార్థులకు ప్రభుత్వ సేవలను మరింత వేగంగా.. పారదర్శకంగా అందించేందుకు మీసేవ కేంద్రాలు సరికొత్త డిజిటల్ హంగులను అద్దుకున్నాయి. కాలయాపనను తగ్గించి, అవినీతికి తావులేకుండా జిల్లా యంత్రాంగం కాగిత రహిత (పేపర్ లెస్) పాలన దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే అటు రెవెన్యూ సేవల్లో విప్లవాత్మక మార్పులతో పాటు, ఇటు విద్యార్థుల కోసం సరికొత్తగా ఎస్సెస్సీ ఈ–మెమోల సేవలను అందుబాటులోకి తెచ్చింది.
విద్యార్థులకు వరం ఎస్సెస్సీ ఈ–మెమో
ఉన్నత చదువుల కోసం అడ్మిషన్ల ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్న వేళ విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. మీసేవ పోర్టల్‌లో తాజాగా ఎస్సెస్సీ మెమో ఈ–కాపీ అనే సరికొత్త సేవను ప్రవేశపెట్టింది. 2004 నుంచి 2024వ సంవత్సరం వరకు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ డూప్లికేట్ ఈ–మెమోను మీసేవ ద్వారా పొందవచ్చు. కేటగిరీ ఏ కింద ఒక్కో దరఖాస్తుకు కేవలం రూ.62 రుసుం చెల్లిస్తే సరిపోతుంది.
సురక్షిత సర్టిఫికెట్
అభ్యర్థి వివరాలను నమోదు చేసిన వెంటనే మీసేవ సెక్యూర్ బేస్ సర్టిఫికెట్‌పై ఈ–మెమో ప్రింట్ రూపంలో అందుతుంది. ఒరిజినల్ మెమోలు పోగొట్టుకున్న వారికి.. అత్యవసరంగా కావాల్సిన వారికి ఈ డిజిటల్ మెమో ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. పూర్తిగా కాగిత రహితం.. ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయి. మరోవైపు జిల్లావ్యాప్తంగా రెవెన్యూ సేవల దరఖాస్తు ప్రక్రియలో సరికొత్త పేపర్ లెస్ విధానాన్ని అధికారులు అమల్లోకి తెచ్చారు. ఇకపై కులం, ఆదాయం, నివాస, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాలతో పాటు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ల కోసం దరఖాస్తుదారులు ఎలాంటి పత్రాలను ఆఫీసుల్లో సమర్పించాల్సిన అవసరం లేదు.
తహసీల్దార్లకు స్పష్టమైన ఆదేశాలు
క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో దరఖాస్తుదారులను భౌతికపత్రాల కోసం వేధించవద్దని జిల్లా ఉన్నతాధికారులు తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ సంస్థ ప్రవేశపెట్టిన నూతన మొబైల్ అప్లికేషన్ ద్వారానే తహసీల్దార్లు ఆన్‌లైన్‌లోనే పత్రాలను పరిశీలించి.. వేగంగా డిజిటల్ సంతకాలతో సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు.
సమయం, డబ్బు ఆదా..
డిజిటల్ విప్లవంలో భాగంగా తీసుకొచ్చిన ఈ నూతన సంస్కరణలు ప్రజలకు, విద్యార్థులకు అటు సమయాన్ని, ఇటు డబ్బును ఆదా చేస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. దళారుల బెడద లేకుండా.. కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా నేరుగా మీసేవ కేంద్రాల ద్వారా ఈ సరికొత్త సేవలను జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
మీసేవలో ‘డిజిటల్’ విప్లవం
ఆన్‌లైన్‌లోనే ఎస్సెస్సీ ఈ–మెమోలు
దరఖాస్తుకు రూ.62 రుసుం
విద్యార్థులకు సువర్ణావకాశం
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు


