స్మోక్‌ సిటీ | - | Sakshi
Sakshi News home page

స్మోక్‌ సిటీ

Apr 13 2026 8:08 AM | Updated on Apr 13 2026 8:08 AM

● నగరాన్ని కమ్మేస్తున్న డంప్‌యార్డ్‌ పొగ ● వేసవిలో మరింత తీవ్రంగా సమస్య ● గాలి నాణ్యత తగ్గడంపై ఆందోళన

కరీంనగర్‌ కార్పొరేషన్‌: స్మార్ట్‌సిటీగా గుర్తింపు పొందిన కరీంనగర్‌ ఇప్పుడు స్మోక్‌ సిటీగా మారుతోంది. డంప్‌యార్డ్‌ నుంచి వెలువడుతున్న పొగ సగం నగరాన్ని కమ్మేస్తోంది. వేసవి కావడంతో సమస్య తీవ్రమవుతోంది. రాత్రి వేళ పొగ రోడ్లు, వీధులు దాటి ఇండ్లల్లోకి చొచ్చుకొస్తోంది. ఫలితంగా ప్రజలు ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరవుతున్నారు. షరామామూలుగానే నగరపాలకసంస్థ అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఎండలు ముదురుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. డంప్‌యార్డ్‌ ఉన్న ఆటోనగర్‌తో పాటు, అలకాపురికాలనీ, కోతిరాంపూర్‌, పోచమ్మవాడ, లక్ష్మినగర్‌, హౌసింగ్‌బోర్డుకాలనీ, గాయత్రినగర్‌, షాషామహల్‌, మారుతినగర్‌, కాపువాడ, బోయవాడ, సిక్‌వాడీ, గణేశ్‌నగర్‌, హనుమాన్‌నగర్‌, తిరుమల్‌నగర్‌, కట్టరాంపూర్‌, రామచంద్రాపూర్‌కాలనీలతో పాటు ఒక్కోసారి భగత్‌నగర్‌, ముకరాంపుర, తెలంగాణచౌక్‌,టవర్‌సర్కిల్‌ వరకు పొగ వ్యాపిస్తోంది.

గాలి నాణ్యతపై ఆందోళన

డంప్‌యార్డ్‌ పొగతో నగరంలో గాలి నాణ్యత క్షీణిస్తుండడంపై నగరవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలి నాణ్యతను ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) ద్వారా నిర్ధారిస్తుంటారు. ఏక్యూఐ స్థాయి 100 దాటితే ప్రమాదం పొంచి ఉన్నట్లే. డంప్‌యార్డ్‌ సమీప ప్రాంతాల్లో శని,ఆదివారాల్లో ఏక్యూఐ స్థాయి 250 వరకు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. డంప్‌యార్డ్‌ ప్రాంతంలో ఏక్యూఐ 408గా చూపించినట్లుగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో సిటీ ప్రజలు మరింతగా ఆందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళ ఇండ్లల్లోకి పొగ రావడంతో తెల్లవార్లు ఇబ్బంది పడుతున్నామంటున్నారు.

చేతులెత్తేసిన అధికారులు

డంప్‌యార్డ్‌ సమస్య శాశ్వత పరిష్కారంపై రాజకీయ రగడ కొనసాగుతున్న తరుణంలో, తాత్కాలిక ఉపశమనం చూపించాల్సిన నగరపాలకసంస్థ అధికారులు చెతులెత్తేశారు. మంటలు చెలరేగకుండా, పొగ వ్యాపించకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆ దిశగా తీసుకున్న జాగ్రత్తలు కనిపించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. డంప్‌యార్డ్‌లో పొగతో ఇబ్బంది పడుతున్న తమ గురించి కనీసం ఆలోచించాలని బాధితులు ప్రజాప్రతినిధులను, ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement