కరీంనగర్‌రూరల్: స్వచ్ఛభారత్‌లో భాగంగా ప్రతి మండల కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం సామూహి క మరుగుదొడ్లను నిర్మించాలనే కేంద్ర ప్రభుత్వ ఆశయం నీరుగారుతోంది. స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీన వైఖరితో మరుగుదొడ్ల నిర్మాణానికి గ్రహణం పట్టింది. స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో 15 సామూహిక మరుగుదొడ్లను నిర్మించేందుకు ప్రణాళికను రూపొందించారు. మార్చి 31వరకు నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అనేక మండల కేంద్రాల్లో ఇంకా పనులు ప్రారంభించకపోవడం గమనార్హం. ప్రభుత్వ స్థలాల కొరత, కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యంతో పనుల్లో జాప్యమేర్పడుతోందనే ఆరోపణలున్నాయి.
ఒక్కో మరుగుదొడ్డికి రూ.3 లక్షలు
ఆయా మండలకేంద్రాల్లో 15 సామూహిక మరుగుదొడ్ల సముదాయానికి మొత్తం రూ.45లక్షలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. రూ.3లక్షల వ్య యంతో ఒక్కో సామూహిక మరుగుదొడ్డి నిర్మిస్తా రు. దీనిలో ఎస్‌బీఎం రూ.2.10లక్షలు, గ్రామపంచాయతీ రూ.90వేలు చెల్లిస్తోంది. చిగురుమామిడి, ఇల్లంతకుంట, గంగాధర, వెంకపల్లి గ్రామాల్లో మాత్రమే సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. గన్నేరువరం, చీలాపూర్‌లో స్లాబ్‌లెవల్, మానకొండూరు, నాగంపేటలో రూఫ్‌లెవల్, వెదిరలో బేస్‌మెంట్‌లెవల్‌లో నిర్మాణంలో ఉన్నాయి. చామనపల్లి, కేశవపట్నం, ఎలగందల్‌లో స్థలాలు అందుబాటులో లేకపోవడంతో ఇంకా నిర్మాణాలు ప్రారంభించలేదు. కొన్ని మండలాల్లో మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభించామని, మరికొన్ని మండలాల్లో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకపోవడంతో నిర్మించలేదని డీఆర్‌డీవో తెలిపారు.


