12 బృందాలు.. 250 ఫుటేజీలు | - | Sakshi
Sakshi News home page

12 బృందాలు.. 250 ఫుటేజీలు

Apr 13 2026 7:26 AM | Updated on Apr 13 2026 7:26 AM

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని దుర్గమ్మ ఆలయం వద్ద గల ఏటీఎం సెంటర్‌లోని మిషిన్‌ను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుంచి వాళ్లు వెళ్లినట్లు అనుమానిస్తున్న మార్గాల్లోని దాదాపు 250 సీసీ పుటేజీలు సేకరించారు. 12 పోలీసు బృందాలను రంగంలోకి దింపి దొంగల కోసం గాలిస్తున్నారు. ఎస్సీ మహేశ్‌ బీ గీతే పర్యవేక్షణలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వెంకటేశ్‌ ఆధ్వర్యంలో ఐదుగురు ఎస్సైలు, 30 మంది పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఏటీఎం కేంద్రంలో చోరీ జరగడంతో పోలీసులు చాలెంజ్‌గా తీసుకున్నారు.

250 సీసీ ఫుటేజీల సేకరణ

ఏటీఎం సెంటర్‌లోని మిషిన్‌ను శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తాళ్లు కట్టి బొలెరోతో లాగి.. ఎత్తుకెళ్లిన ఘటనతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం ఉలిక్కిపడింది. వేసవి మొదట్లోనే భారీ చోరీ జరగడం.. అది కూడా పోలీస్‌స్టేషన్‌కు అతి సమీపంలో ఉన్న ఏటీఎం సెంటర్‌లో దొంగతనం జరగడంతో స్థానికులు మరింత భయాందోళన చెందుతున్నారు.

బొలెరోతో రెక్కీ

ఏటీఎం మిషిన్‌ చోరీకి పాల్పడ్డ దుండగులు దాదాపు రెండు నుంచి మూడు గంటలపాటు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. బొలెరో వాహనంలో వచ్చిన దుండగులు ముందుగా స్థానిక సాయిబాబా ఆలయం సమీపంలో చాలా సేపు వేచి చూసినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి ఏటీఎం సెంటర్‌ వరకు వచ్చి యూటర్న్‌ తీసుకొని మళ్లీ గొల్లపల్లి వైపు వెళ్లినట్లు సీసీ పుటేజీల ద్వారా తెలుస్తోంది. బొలెరోతో రెక్కి నిర్వహిస్తున్న సమయంలోనే ఓ పోలీస్‌ జీపు సైతం వారి వాహనాన్ని దాటి వెళ్లడం స్పష్టంగా తెలుస్తోంది. పోలీసుల కదలికలను పసిగడుతూనే దొంగలు ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. సాకేతికతను వాడుకుని దొంగతనానికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది.

ఎటు వైపు వెళ్లారు?

ఏటీఎం మిషిన్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు పోలీసుల దృష్టి మళ్లించేందుకు ఎల్లారెడ్డిపేట నుంచి రాగట్లపల్లి వైపు వెళ్లి అక్కడి నుంచి దుమాల మీదుగా అక్కపల్లి వరకు వెళ్లారు. అక్కడ మిషిన్‌ను పగులగొట్టి అందులోని నగదు తీసుకొని ఆ డబ్బాను అక్కడే పడేశారు. అక్కడి నుంచి శివంగాళపల్లి, కోనరావుపేట మీదుగా కరీంనగర్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అక్కడి నుంచి ఎటు వైపు వెళ్లారనేది స్పష్టంగా తెలియడం లేదు. చోరీ జరిగి 24 గంటలు గడుస్తున్నా దొంగలు ఎటు నుంచి వచ్చారు, ఎటు వెళ్లారో తెలియడం లేదు. అయితే గతంలో పోలీసులు, పౌరసమాజం కలిసి ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలలో సగం కూడా పనిచేయడం లేదు. సీసీ కెమెరాలు పని చేసి ఉంటే దొంగల ఆచూకీ లభించే అవకాశం ఉండేదనే చర్చ సాగుతోంది.

ఠాణాకు కూతవేటు దూరంలోనే..

చోరీ జరిగిన ఏటీఎం సెంటర్‌ ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఉంటుంది. పోలీస్‌స్టేషన్‌ పరిసరాల్లో నిల్చుంటే ఏటీఎం సెంటర్‌ వద్ద ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. గంటల కొద్ది బొలెరో వాహనం ప్రధాన రహదారిపైనే సంచరిస్తుంటే ఎవరికీ అనుమానం రాకపోవడం గమనార్హం.

రంగంలోకి పోలీసులు

ఏటీఎం చోరీ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ మహేశ్‌ బీ గీతే రంగంలోకి భారీ సంఖ్యలో పోలీసులను దించారు. 12 పోలీసు బృందాలు దొంగలను పట్టుకునేందుకు గాలింపు చేపడుతున్నాయి. ఈ క్రమంలో సేకరించిన 250 సీసీ పుటేజీలను 30 మంది పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఏడాదిలో రెండో సంఘటన

ఎల్లారెడ్డిపేట మండలంలో ఏటీఎంలను దొంగలు టార్గెట్‌ చేయడం ఇది రెండో సంఘటన. గతేడాది క్రితం రాచర్లగొల్లపల్లిలోని ఏటీఎంను బద్దలు కొట్టి చోరీకి విఫలయత్నం చేశారు. సాధ్యం కాకపోవడంతో వెనుదిరిగారు. ఏడాది తర్వాత మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంను టార్గెట్‌ చేసి ఏకంగా మిసిన్‌నే ఎత్తుకెళ్లడం చర్చనీయమైంది.

నిఘా వైఫల్యం

ఏటీఎం దగ్గర బ్యాంకు అధికారులు సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయకపోవడమే దొంగలకు అనుకూలంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటీఎంలలో లక్షల్లో డబ్బులు పెట్టి కనీసం భద్రత చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు దారితీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏటీఎంల దగ్గర చోరీలు జరుగుతున్నా ఇటు బ్యాంకు అధికారులు.. అటు పోలీసులు కనీస భద్రత చర్యలు చేపట్టడం లేదు. ఏటీఎం మెషిన్‌ను దొంగలు ఎత్తుకెళ్తున్న క్రమంలో బ్యాంకు మేనేజర్‌కు హెచ్చరక అలారం వెళ్లినా ఆయన సకాలంలో స్పందించకపోవడంతో దొంగలు సునాయాసంగా తమ పని కానిచ్చారని తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతున్నా భద్రత చర్యలు చేపట్టడంలో అందరూ విఫలమవుతున్నారని విమర్శలు ఉన్నాయి.

ఏటీఎం చోరీపై పోలీసుల సీరియస్‌

క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు

కరీంనగర్‌ వైపు వెళ్లినట్లు అనుమానాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement