బస్సు, ఆటో ఢీ | - | Sakshi
Sakshi News home page

బస్సు, ఆటో ఢీ

Apr 13 2026 7:26 AM | Updated on Apr 13 2026 7:26 AM

బస్సు, ఆటో ఢీ

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రం శివారులోని గాయత్రి డిగ్రీ కాలేజీ సమీపంలో ఆదివారం బస్సు, ఆటో ఢీకొని ముగ్గురికి గాయాలయ్యాయి. కామారెడ్డికి చెందిన రోహన్‌ అనే ఆటో డ్రైవర్‌ మద్యం మత్తులో, రాంగ్‌ రూట్లో వెళ్తూ బస్సు వైపు వెళ్లాడు. ఆటోను గమనించిన బస్సు డ్రైవర్‌ తప్పించే ప్రయత్నంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తోపాటు బస్సులోని ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఉరివేసుకొని యువతి ఆత్మహత్య

జమ్మికుంట: అనారోగ్య కారణాలతో యువతి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. టౌన్‌ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం పట్టణంలోని కృష్ణకాలనీకి చెందిన చిట్యాల ప్రణతి(24) మూడేళ్లుగా రక్తహీనత, అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఎన్ని ఆస్పత్రులు తిరిగిన నయం కాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందింది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి విజయ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.

అత్తింటి వేధింపులతో వివాహిత..

కరీంనగర్‌క్రైం: అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వన్‌టౌన్‌ పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్‌లోని గాయత్రినగర్‌కు చెందిన దేవరకొండ సురేశ్‌ కూతురు శ్వేతారాణి(24)ని జనగామకు చెందిన సల్ల సురేశ్‌కు ఇచ్చి 2020 ఏడాదిలో వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు పిల్ల లున్నారు. కొద్దిరోజులుగా అత్తింటివారు వేధిస్తున్నారు. ఈ నెల 7న శ్వేతారాణి చిన్న కొడుకు మొదటి పుట్టిన రోజు జనగామలో జరిగింది. ఫంక్షన్‌లో శ్వేతారాణికి భర్త సురేశ్‌, అతని తమ్ముడు సంతోష్‌, అతని భార్య, అత్తమామలు, అడపడుచులతో గొడవ జరిగింది. గొడవకు కారణం శ్వేతారాణి అని అత్తామామలు ఫంక్షన్‌హాల్‌ నుంచి వెళ్లగొట్టడంతో కరీంనగర్‌ వచ్చింది. ఆ గొడవపై జనగామ పోలీసులకు శ్వేతారాణి అత్తింటివారు ఫిర్యాదు చేశారు. పోలీసులు పిలవడంతో శనివారం శ్వేతారాణి, ఆమె తల్లిదండ్రులు జనగామా వెళ్లారు. అక్కడా భర్త, అత్తామామ, వారి కుటుంబసభ్యులు తీవ్రంగా దూషించడంతో కరీంనగర్‌కు వచ్చిన శ్వేతారాణి ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శ్వేతారాణి తండ్రి సురేశ్‌ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్‌

వేములవాడఅర్బన్‌: వేములవాడలోని సూపర్‌ మార్కెట్లను టార్గెట్‌ చేసుకొని బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌ తరలించినట్లు టౌన్‌ సీఐ వీరప్రసాద్‌ ఆదివారం తెలిపారు. చంద్రంపేటకు చెందిన గుడిసెల మహేశ్‌ జర్నలిస్టుగా వేములవాడలోని సూపర్‌ మార్కెట్‌ యజమాని పరిచయం చేసుకున్నాడని తెలిపారు. సూపర్‌ మార్కెట్లో అక్రమాలు జరుగుతున్నాయని వీటిని బయటపెడతానని, అధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఒకసారి రూ.30వేలు తీసుకోగా, మరోసారి రూ.12వేలు కూడా ఫోన్‌పే ద్వారా వసూలు చేసినట్లు వివరించారు. మరికొంత నగదు కావాలని బెదిరిస్తుండగా బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి రిమాండ్‌ తరలించామని సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement