పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంటలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారంటూ సర్పంచ్ సహా పలువురు గ్రామస్తులు ఆదివారం టిప్పర్లను అడ్డుకుని అద్దాలు ధ్వంసం చేశారు. మట్టి రవాణాకు అనుమతి పొందిన దానికన్న ఎక్కువ మొత్తంలో మట్టి తరలిస్తున్నారని సర్పంచ్ గోగు రాజయ్య, పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గోరంత అనుమతులు పొంది కొండంత సహజసంపదను అక్రమంగా తరలించుకుపోతున్నారని తెలిపారు. ట్టి టిప్పర్లు అడ్డగించడంతో వివాదం జరుగుతుందనే సమాచారం మేరకు రూరల్ పోలీసులు రంగప్రవేశం చేసి సముదాయించారు. ఈ విషయమై సంబంధిత మైనింగ్ అధికారులకు సైతం సమాచారం అందించారు.
జీపీఆర్‌ఎస్‌తో అనుసంధానం
మట్టి టిప్పర్లను ఠాణాకు తరలించాలని మైనింగ్ అధికారులు సూచించగా అభ్యంతరం వ్యక్తం చేసినట్టు కాంట్రాక్టర్ రాంరెడ్డి తెలిపారు. మైనింగ్ అధికారుల సూచన మేరకు వాహనాలకు జీపీఆర్‌ఎస్‌ను అమర్చి వాటిని మైనింగ్ శాఖ అధికారులకు అనుసంధానం చేశానని, వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. సమ్మక్క జాతర సమయంలో తాను అభివృద్ధి పనులకు తనవంతు సహకారం అందించానని, అలా కాకుండా తమకే కొంతమొత్తాన్ని ఇవ్వాలని గ్రామ సర్పంచ్ డిమాండ్ చేస్తూ ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయమై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలన్నారు. గ్రామంలో సీసీకెమెరాలు, వాహనాలకు జీపీఆర్‌ఎస్‌ను పరిశీలించాలని ప్రతీ టిప్పుక వేబిల్లు తీసుకుంటున్నా ఇలాంటి ఇబ్బందులు సృష్టించి మనోవేదన కలిగించడం సరికాదన్నారు. టిప్పర్ల అద్దాలు ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రూరల్‌పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసినట్లు రాంరెడ్డి తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందిందని విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
అక్రమంగా మట్టి తరలిస్తున్నారంటూ ఆరోపణ
అక్రమం కాదు.. సక్రమమేనంటున్న కాంట్రాక్టర్


