
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
హుజూరాబాద్: పట్టణంలో ఆదివారం గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. బొడిగె సందీప్(25) ఆదివారం తన స్కూటీపై బతుకమ్మ సౌళ్ల వద్ద నుంచి వస్తుండగా.. ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం వేగంగా ఢీకొనడంతో సందీప్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హుజూరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ సందీప్ అప్పటికే మృతిచెందాడు. మృతుడికి భార్య ప్రత్యూష, ఇద్దరు పిల్లలు శ్రీత్విక్, ఆయాన్ష్ ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిసింది.
చందుర్తి(వేములవాడ): చందుర్తి మండలం మూడపల్లి బస్టాండ్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదివారం ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల కథనం ప్రకారం.. సనుగుల గ్రామానికి చెందిన బొజ్జ చరణ్, మహ్మద్ షారుక్ అనే ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వేములవాడ వైపు వెళ్తుండగా.. మూడపల్లి బస్టాండ్ ప్రాంతంలో పోలీసులు ఫొటోలు తీస్తున్నారని గమనించారు. తొందరపాటులో వెనక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును గమనించకపోవడంతో ద్విచక్ర వాహనానికి బస్సు తగిలి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో చరణ్‌కు కాలు విరగగా.. షారుక్ స్పృహ తప్పి పడిపోయాడు. 108 అంబులెన్స్‌లో వీరిని వేములవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చరణ్‌కు వేములవాడలో చికిత్స చేస్తుండగా.. షారుక్‌ను కరీంనగర్ తరలించారు. ఇతడి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గంగాధర: మధురానగర్ చౌరస్తాలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కారుకు నిప్పు పెట్టి పేల్చే ప్రయత్నం చేశారు. స్థానికుల సమాచారం ప్రకారం.. మోతె శ్రీహరిరెడ్డి అనే వ్యక్తి తన ఇంటి పక్కన కారు పార్కింగ్ చేశాడు. రాత్రి సమయంలో దుండగులు కారుకు నిప్పు పెట్టి పారిపోయారు. కారు యజమాని మంటలు గమనించి ఆర్పేశాడు. పోలీసులకు సమాచారమివ్వడంతో ఆదివారం సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ పేర్కొన్నారు. నిప్పు పెట్టినవారు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం