
నయా భూ దందా
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో నయా భూ దందా వెలుగులోకి వచ్చింది. ఎవరికీ పట్టని హౌ జింగ్‌బోర్డు స్థలాలపై గురిపెట్టిన కబ్జారాయుళ్లు గుట్టుగా దందా కొనసాగిస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన స్థలాలను కబ్జాకు పెడుతున్నారు. పక్క సర్వే నంబర్లు వేసి ఏకంగా రిజిస్ట్రేషన్‌లు కూడా చేసుకుంటున్నారు. ఆ పై ఇంటినంబర్లతో అధికారిక ముద్ర వేసుకునేందుకు బల్దియాలో పైరవీలు కూడా మొదలుపెట్టారు.
1994లో అలాట్‌మెంట్
దశాబ్దాల క్రితం నగరంలోని పాత బైపాస్ పక్కన 99 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకొని హౌజింగ్‌బోర్డుకాలనీని నిర్మించింది. మొ త్తం 1,205 క్వార్టర్స్ నిర్మించడంతో పాటు, రోడ్లు, క్రీడా స్థలం, హెల్త్ సెంటర్, షాపింగ్‌కాంప్లెక్ష్ తదితర అవసరాలకు ఈ స్థలాన్ని వినియోగించింది. పూర్తయిన క్వార్టర్స్ అలాట్‌మెంట్‌ను 1994లో ప్రారంభించి, 2006లో అధికారులు పూర్తి చేశారు.
మిగిలిన ఖాళీ స్థలాలు..
నిర్ణీత సైజుల్లో క్వార్టర్స్ నిర్మించిన సమయంలోనే అక్కడక్కడా ఖాళీస్థలాలు మిగిలిపోయాయి. ఖాళీ స్థలం 99 గజాల లోపు ఉంటే ఆ స్థలాన్ని పక్కనే ఉన్న ఇంటి యజమానికే నిర్ణీత ధర ప్రకారం హౌజింగ్‌బోర్డు విక్రయించింది. 100 గజాలు, అంతకన్నా ఎక్కువ స్థలం ఉంటే బహిరంగ వేలం ద్వారా విక్రయించాల్సి ఉంటుంది. చివరగా 2002లో కొన్ని స్థలాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించారు.
ఖాళీ స్థలాల కబ్జా
హౌజింగ్‌బోర్డు కాలనీ నిర్మాణం పూర్తయి మూడు దశాబ్దాలవుతున్నా, కాలనీలో విలువైన ఖాళీ స్థలాలు ఇప్పటికీ ఉన్నాయి. 100 గజాలకు పై బడి విస్తీర్ణం కలిగిన పది వరకు ఖాళీ స్థలాలపై కొంతమంది కన్ను పడింది. హౌజింగ్‌బోర్డు డివిజన్ కార్యాలయం ఎక్కడో వరంగల్‌లో ఉండడం, పర్యవేక్షణ లేకపోవడం వారికి అనువుగా మారింది. పైగా స్మార్ట్ సిటీలో కాలనీ అభివృద్ధి చెందడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ఖాళీ స్థలాలను కబ్జా చేసేందుకు సదరు ముఠా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే కనీసం కోట్ల రూపాయల విలువైన స్థలాలను సొంతం చేసుకుంది.
పక్క సర్వే నంబర్ వేసి..
ఖాళీ స్థలాల కబ్జా కోసం ముఠా కొత్త ఎత్తులు వేస్తోంది. హౌజింగ్‌బోర్డు కాలనీ సరిహద్దులో ఉన్న స్థలాలకు, పక్కనే ఉండే ప్రైవేట్ భూముల సర్వే నంబర్లు వేసి ఏకంగా రిజిస్ట్రేషన్‌లు చేసుకుంటోంది. హౌజింగ్‌బోర్డు కాలనీ స్థలాలు 225,226,227,228,229,230,231/ఏ,231/బీ,233/ఏ,233/బీ,234,235,236/ఏ,236/బీ,727 సర్వే నంబర్లలో ఉన్నాయి. కాని పక్కనే ఉన్న 224 సర్వే నంబర్ వేసి ఆ నంబర్‌లో ఉన్న ప్రైవేట్ వ్యక్తితో తాజాగా 155 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడంపై కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా కాలనీ మెయిన్‌రోడ్డులోని మరో స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్పటికే ఆ స్థలంలో కొంత భాగం ఆక్రమణకు గురికాగా, మిగతా స్థలంలో సైతం ప్రహారీ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రాథమిక పాఠశాల ప్రాంతంలోనూ ఇలాంటి స్థలాలను ఇప్పటికే కబ్జా చేశారు. ఇదిలాఉంటే కబ్జాకు అధికారిక ముద్ర వేసుకునేందుకు నగరపాలకసంస్థ నుంచి ఇంటినంబర్లు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాపాడాల్సిందే..
అన్యాక్రాంతమవుతున్న కోట్ల రూపాయల హౌజింగ్‌బోర్డు ఖాళీ స్థలాలను అధికారులు కాపాడాలని కాలనీవాసులు కోరుతున్నారు. తాజాగా కబ్జాకు గురైన స్థలాల విలువ రూ.1.30 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి భూములు కాపాడేందుకు హౌజింగ్‌బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలని, వేలం వేసే వరకు ఆ స్థలాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
హౌజింగ్‌బోర్డుకాలనీలో స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటాం. నిబంధనల ప్రకారం ఈ స్థలాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలి. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఆ లోగా స్థలాల రక్షణకు చర్యలు చేపడుతాం. అవసరమైతే పోలీసుల సహకారంతో ఆక్రమణలు తొలగించి స్వాధీనం చేసుకుంటాం.
– పృథ్విరాజ్, ఏఈ, హౌజింగ్‌బోర్డు
స్వాధీనం చేసుకుంటాం

నయా భూ దందా

నయా భూ దందా