
సైక్లింగ్‌తో పర్యావరణ, ఆరోగ్య పరిరక్షణ
కరీంనగర్‌స్పోర్ట్స్: ప్రస్తుత జీవనశైలిలో ప్రతి ఒక్కరూ సైక్లింగ్‌ను భాగం చేసుకుంటే సమాజ శ్రేయస్సుతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కెప్టెన్ బుర్ర మధుసూదన్‌రెడ్డి అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం స్థానిక ఎస్సారార్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో రైడ్ ఫర్ వెల్‌నెస్, శ్రేయస్సు కోసం సైక్లింగ్ అనే నినాదంతో నిర్వహించిన సైక్లింగ్ ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పురుషులతో పాటు మహిళలు తమ ఆరోగ్యం కోసం కొంత సమయాన్ని విధిగా కేటాయించి శారీరక వ్యాయామం కలిగేలా క్రీడలు, నడక, సైక్లింగ్, యోగా లాంటి కార్యాలను నిత్య జీవితంలో భాగం చేసుకొని ఆయురారోగ్యాలతో జీవితాలను సుసంపన్నం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నేటి డిజిటల్ యువత స్మార్ట్ ఫోన్ నీలి తెరలకు పరిమితం కాకుండా మైదాన క్రీడలు, సైక్లింగ్ లాంటివి ఆచరణలో పెట్టాలన్నారు. 9వ తెలంగాణ ఎన్‌సీసీ బెటాలియన్ సుబేదార్ మేజర్ సాగర్‌సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కెడెట్లు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.