
రైతులకు తప్పని యూరియా తిప్పలు
చిగురుమామిడి(హుస్నాబాద్): రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. ఆదివారం మండలంలోని రేకొండ గ్రామంలో యూరియా కోసం బారులు తీరారు. ఉదయం ఐదు గంటల నుంచి మహిళలు, రైతులు గంటల తరబడి క్యూలో నిలబడ్డారు. చిగురుమామిడి సింగిల్ విండో ఆధ్వర్యంలో 230 బస్తాల యూరియా రాగా ఒక్కో రైతుకు రెండేసి బస్తాలు పంపిణీ చేశారు. 115 మంది రైతులకు పంపిణీ చేయగా మరో 40 మంది బస్తాలు అందక తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ప్రభుత్వం సరిపడా బస్తాలను పంపించక తమను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్: జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో ఆదివారం నిర్వహించిన జిల్లా జూనియర్స్ అథ్లెటిక్స్ బాలబాలికల ఎంపిక పోటీలకు విశేశ స్పందన వచ్చింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరుకాగా పలు విభాగాల్లో పోటీలు నిర్వహించినట్లు జిల్లా అథ్లెటిక్ సంఘం అధ్యక్షుడు నందెల్లి మహిపాల్ తెలిపారు. సమారు 160 మంది క్రీడాకారులు ప్రతిభచాటగా అత్యుత్తమంగా రాణించిన 30 మందిని ఈనెల 30, 31వ తేదీల్లో మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు యూనివర్సిటీలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. జిల్లా జట్లకు ఎంపికై న క్రీడాకారులు 29న పాలమూరు స్టేడియంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని పేర్కొన్నారు. పోటీల నిర్వహణలో పీఈటీ, పీడీలు రమేశ్, చంద్రశేఖర్, ఎజాజ్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
పుణ్యక్షేత్రాల దర్శనానికి ప్రత్యేక బస్సు
విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్– 1 డిపో నుంచి ఈనెల 21న అన్నవరం, పిఠాపురం శక్తిపీఠం, సింహాచలం, వైజాగ్ బీచ్, ద్వారక తిరుమల దర్శనాల కోసం ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ విజయమాధురి తెలిపారు. ఈ బస్సు 21 గురువారం సాయంత్రం 6గంటలకు కరీంనగర్ బస్‌స్టేషన్ నుంచి బయలుదేరి తిరిగి 23వ తేదీన కరీంనగర్ చేరుకుంటుందని పేర్కొన్నారు. ఇందులో పెద్దలకు రూ.3,000, పిల్లలకు రూ.2,250 టికెట్ ఉంటుందని, వివరాలకు 99592 25920, 80746 90491, 73828 49352 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
బీసీలకే కాంగ్రెస్ ఇన్‌చార్జి ఇవ్వాలి
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పదవి బీసీలకే ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేశిపెద్ది శ్రీధర్‌రాజు డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉన్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగు పర్యాయాలు బీసీ అభ్యర్థియే గెలుస్తూ వచ్చారని తెలిపారు. బీసీల్లో చైతన్యం రావడాన్ని చూసి అన్ని పార్టీలు కరీంనగర్‌లో బీసీలకే మొగ్గు చూపుతున్నాయన్నారు. అందుకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ అన్ని పార్టీలు బీసీలకే టికెట్‌లు ఇచ్చాయని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవిని అగ్రవర్ణాలకు ఇస్తే, మళ్లీ పాత రోజులు పునరావృతమవుతాయన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలో కొట్లాడుతున్న కాంగ్రెస్ అధిష్టానం, అదే తరహాలో కరీంనగర్ ఇన్‌చార్జీగా బీసీనే నియమించాలని కోరారు. సంఘం జిల్లా కన్వీనర్ రవీంద్రచారి, సత్యనారాయణ, జగన్, రాజు, రమేశ్ పాల్గొన్నారు.

రైతులకు తప్పని యూరియా తిప్పలు

రైతులకు తప్పని యూరియా తిప్పలు