
వెన్నుచూపని వీరుడు పాపన్న
కరీంనగర్‌టౌన్: గొల్లకొండ కోటపై జెండా ఎగరేసిన బహుజనుల ముద్దుబిడ్డ సర్వాయి పాపన్న అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ కొనియాడారు. పాపన్న జయంతిని పురస్కరించుకుని ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్‌రావు తదితరులతో కలిసి నగరంలో సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సామాన్య కల్లుగీత కుటుంబంలో పుట్టి నాటి మొగల్ చక్రవర్తుల వెన్నులో వణుకు పుట్టించిన అసామాన్యుడు, వెన్నుచూపని వీరుడి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్, సర్దార్ సర్వాయి పాపన్న దాదాపు సమకాలీనులేనని కానీ, ఛత్రపతి శివాజీకి దేశ చరిత్రలో దక్కిన స్థానం సర్దార్ పాపన్నకు దక్కకపోవడం బాధాకరమన్నారు. తాడిత, పీడిత ప్రజల కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టి రాజ్యస్థాపన చేసిన పాపన్న చరిత్రను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కోడూరి పర్శరాములు, బుర్ర పర్శరాములు, పడాల రమేశ్, బుర్ర కనకయ్య, పంతంగి అనిల్, సంపత్, ముంజ ప్రశాంత్, బత్తిని కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.