
పురుగుల మందు తాగి విద్యార్థి బలవన్మరణం
రాయికల్: అయోధ్య గ్రామానికి చెందిన ఎడ్మల శ్రీసాహిత్‌రెడ్డి(21) అనే డిగ్రీ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. శ్రీసాహిత్‌రెడ్డి హైదరాబాద్‌లో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి ఇంటికొచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగగా.. గమనించిన స్థానికులు జగిత్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఉన్న ఒక్క కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతికి గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ జగిత్యాల ఆస్పత్రిలో కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మహిళ..
శంకరపట్నం: కాచాపూర్ గ్రామంలో అబ్బు శకుంతల(58) అనే మహిళ ఆదివారం వేకువజామున వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కాచాపూర్ గ్రామానికి చెందిన అబ్బు సత్యానారాయణరెడ్డి–శకుంతల దంపతులకు ముగ్గురు కూతుళ్లుండగా.. అందరికీ వివాహమైంది. కొంతకాలంగా శకుంతల మానసిక వ్యాధితో బాధ పడుతోంది. మానసిక వైద్యుడి వద్ద చికిత్స చేయిస్తున్నారు. మందులు వాడుతున్నా నయం కాలేదు. ఆదివారం వేకువజామున ఓ రైతుకు చెందిన వ్యవసాయ బావిలో దూకింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపారు.
వృద్ధురాలు..
ధర్మారం: నర్సింగపూర్ గ్రామానికి చెందిన చల్లా రాజమ్మ(78) అనే వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ధర్మారం ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. కొంతకాలంగా బీపీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ చికిత్స చేయించుకుంటున్నా నయం కావడం లేదు. దీంతో రాజమ్మ మానసికంగా కుంగిపోయి ఇంటి సమీపంలోని మంచినీటి బావిలో దూకింది. ఆమె కుమారుడు గంగయ్య ఆదివారం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
సైదాపూర్: ఎగ్లాస్‌పూర్‌లో సంతపురి రవీందర్‌రెడ్డి(65) శనివారం రాత్రి ఇంటి ఎదుట రేకుల షెడ్‌కు ఉరేసుకున్నట్లు సైదాపూర్ ఎస్‌ఐ తిరుపతి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. రవీందర్‌రెడ్డి కూతురు శైలజకు వివాహమైంది. ఆమె హైదరాబాద్‌లో ఉంటోంది. భార్యతో కలిసి రవీందర్‌రెడ్డి ఎగ్లాస్‌పూర్‌లో ఉంటున్నాడు. రవీందర్‌రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. తనను చూసుకోవడానికి అయినవారు అందుబాటులో లేక మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
చేపలు పట్టేందుకు వెళ్లి మృతి
పెగడపల్లి: బతికపల్లి గ్రామానికి చెందిన మన్నె రాజనర్సు(55) అనే వ్యక్తి చేపలు పట్టేందుకని వెళ్లి దుర్మరణం చెందాడు. పెగడపల్లి ఎస్సై కిరణ్‌కుమార్ వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం ఇంటి నుంచి స్థానిక చెరువులోకి చేపలు పట్టేందుకు వెళ్లిన రాజనర్సు మధ్యాహ్నం తిరిగి వస్తున్న క్రమంలో మార్గమధ్యంలో కస్తూరి మల్లేశం అనే రెతుకు చెందిన పొలం గట్టుపై ప్రమాదవశాత్తు పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

పురుగుల మందు తాగి విద్యార్థి బలవన్మరణం