
ధర్మం చిరకాలం నిలుస్తుంది
కరీంనగర్ కల్చరల్: సంఘర్షణతో సమాజం విడిపోతుందని, సంఘటన మాత్రమే మానవులను కలిపి ఉంచుతుందని, తద్వారా ధర్మం చిరకాలం నిలుస్తుందని విశ్రాంత ఐఏఎస్ అధికారి చామర్తి ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం భగవతి పాఠశాల ప్రాంగణంలో జాతీయ సాహిత్య పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాక రాజమౌళి రచించిన భారత భారతి, భావతరంగాలు గ్రంథాల ఆవిష్కరణ సభలో మాట్లాడారు. పాక రాజమౌళి దేశ, దైవభక్తి కలిగిన రచయితగా అద్భుతమైన పద్య, గేయ, అనువాద కవిత్వాన్ని రచించారని, ప్రతీ రచనలోనూ జ్ఞానం, శీలం, దేశభక్తి, సమానత్వం, సద్గుణాల నిర్మాణం కలగలిసి పాఠకులను విశేషంగా ఆకర్షిస్తాయని ప్రశంసించారు. వ్యక్తిత్వం లేని మనిషి మనోవిగ్రహాన్ని సాధించలేడని, తద్వారా ధర్మ రక్షణ సాధ్యం కాదని, ధర్మ రక్షణకు సంఘటిత శక్తిని అలవర్చుకోవాలని తన కవిత్వం ద్వారా రాజమౌళి స్పష్టం చేశారన్నారు. పాఠకుల్లో జాతీయ భావజాలాన్ని పెంపొందించి, ప్రతీ పౌరున్ని కర్తవ్య పథంలో నడిపించే శక్తి ఈ కవిత్వానికి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు డా.భీమనాథుని శంకర్, కాకతీయ విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు చిలకమారి సంజీవ, భగవతి విద్యాసంస్థల అధినేత రమణారావు, కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత నాగిరెడ్డి కేశవరెడ్డి, జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు గాజుల రవీందర్, ప్రధాన కార్యదర్శి నంది శ్రీనివాస్, స్తంభంకాడి గంగాధర్, కవులు గంగుల శ్రీకర్, అనంతోజు పద్మశ్రీ, నీలగిరి అనిత, వినీత్ కాశ్యప్, జక్కని గణేశ్, డా.కల్వకుంట్ల రామకృష్ణ, కేఎస్ అనంతాచార్య, పుప్పాల కృష్ణగోపాల్, జంగానీ యుగంధర్, బొమ్మకంటి కిషన్, ఎంఆర్వీ ప్రసాద్, దేవరం సతీశ్ తదితరులు పాల్గొన్నారు.