
ఇతిహాసాలే మన సంస్కృతి
కరీంనగర్ కల్చరల్: రామాయణ, మహాభారత ఇతిహాసాలు మన సంస్కృతిగా స్థిరపడ్డాయని ప్రముఖ వైద్యుడు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర పూర్వాధ్యక్షుడు డాక్టర్ బీఎన్‌రావు అన్నారు. తెలంగాణ రచయితల వేదిక(తెరవే) ఆధ్వర్యంలో ఆదివారం ఫిలింభవన్‌లో కవి ఆవంచ ప్రమోద్ రచించిన మేలిమి చింత పుస్తక పరిచయ సభలో మాట్లాడారు. వాక్యం రసాత్మకం కావాలంటే భాష శైలిలను పట్టించుకొని, సొంత అభివ్యక్తిని కవులు శ్రమతో సాధించాల్సి ఉంటుందన్నారు. రెండు ఇతిహాసాలను రచించిన రచయితలే మన సంస్కృతి నిర్మాతలని అభిప్రాయపడ్డారు. ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ బి.విజయమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. మానవులను ఉన్నతీకరించే ఉత్తమ సాధనం సాహిత్యమని అన్నారు. ఇటీవల మరణించిన వరంగల్ రచయిత్రి అనిశెట్టి రజితకు సభ ప్రారంభంలో సభికులు నివాళి అర్పించారు. తెరవే జిల్లా అధ్యక్షుడు సీవీ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కవులు కందుకూరి అంజయ్య, విజయకుమార్, కూకట్ల తిరుపతి, కనకం శ్రీనివాసులు, అన్నవరం దేవేందర్, గాజోజు నాగభూషణం, పీఎస్ రవీంద్ర, గులాబీల మల్లారెడ్డి, దామరకుంట శంకరయ్య, బూర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
తెరవే సభలో డాక్టర్ బీఎన్‌రావు