
రాజయ్య మృతదేహం
ముత్తారం(మంథని): ఓటువేసి.. వరి కోయించేందుకు పొలం వద్దకు వెళ్లిన ఓ రైతు గుండెపోటుతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ముత్తారానికి చెందిన రాపెల్లి రాజయ్య(65) గురువారం ఉదయం ఓటుహక్కు వినియోగించుకున్నాడు. తర్వాత తనకున్న ఎకరం భూమిలో వరి కోయించేందుకు వెళ్లాడు. పొలం దిగబడుతుండటంతో కోత మెషీన్ వచ్చేలోపు కొంతవరకు కోశాడు. దాన్ని కుప్ప చేస్తుండగా ఒక్కసారి చాతిలో నొప్పి, రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. అటుగా వెళ్లిన ఓ రైతు రాజయ్యను చూసి, లేపే ప్రయత్నం చేశాడు. లేవకపోవడంతో అతను చనిపోయాడన్న సమాచారాన్ని కుటుంబసభ్యులకు చేరవేశాడు. ఓటు వేసి, పొలంకాడికి పోయి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా అంటూ మృతుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అతనికి భార్య కనకలక్ష్మి, కుమారుడు, కూతురు ఉన్నారు.
గుండెపోటుతో రైతు మృతి
ముత్తారంలో ఘటన