చివరికి నీరందేనా?
నేటినుంచి ఎల్‌ఎండీ నీటి విడుదల
కాకతీయ కాలువ ద్వారా వారబందీ పద్ధతిలో సాగునీరు
స్టేజ్–1, స్టేజ్–2 కింద 9.40 లక్షల ఎకరాలకు సాగునీరు
వృథా చేయొద్దని అధికారుల సూచన
డీబీఎం ఉప కాలువల పరిస్థితిపై రైతుల ఆందోళన
మానకొండూర్: ఎల్‌ఎండీ ఆయకట్టు భూములకు నేటినుంచి కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల చేయనున్నారు. బుధవారం ఉదయం 11గంటలకు ప్రాజెక్టు వద్ద ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అధికారులు స్విచ్‌ఆన్ చేసి నీటిని విడుదల చేయనున్నా రు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురియడంతో ఎల్‌ఎండీ నిండుకుండగా మారింది. ఆయకట్టు పరిధిలోని చెరువు, కుంటలు కూడా నీటితో కళకళలాడుతున్నాయి. వరి కోతల నాటికి ప్రాజెక్టు సాగునీరు సరిపపోకపోతే మిడ్‌మానేరు ద్వారా అందిస్తామని, యాసంగిలో ఆ పరిస్థితి రాకపోవచ్చని ఎస్సారెస్పీ అధికారులు వెల్లడించారు. ఆయకట్టు పరిధిలో వరినాట్లు జోరందుకోగా.. స్టేజ్–1, స్టేజ్–2 కింద 9.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. అక్కడక్కడ ఉపకాలువల నిర్వహణ లేకపోవడంతో చివరి వరకు సాగునీరు అందడం కష్టమేనని రైతులు అంటున్నారు.
వారబందీ పద్ధతిలో సాగునీరు
ఎల్‌ఎండీ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు చివరి భూముల వరకు వారబందీ పద్ధతిలో రెండు స్టేజ్‌ల్లో సాగునీరు అందించనున్నారు. 146 కిలోమీటర్ నుంచి 284 కిలో మీటరు వరకూ స్టేజ్–1గా, 284 కిలో మీటరు నుంచి 340 కిలో మీటరు వరకు స్టేజీ–2గా విభజించారు. ఈ రెండు స్టేజ్‌ల పరిధిలో 9.40 లక్షల ఎకరాలు సాగవుతోంది. స్టేజీ–1కు 7రోజుల పాటు, స్టేజ్–2 పరిధిలో ఎనిమిది రోజులపాటు సాగునీరు విడుదల చేయనున్నారు.
అధ్వానంగా ఉపకాలువలు
కాకతీయ కాలువ పరిధిలోని ఉపకాలువలు ఆధ్వానంగా ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు అక్కడక్కడ కూలిపోవడంతో చివరి ఆయకట్టుకు నీరు అందుతుందో లేదోనని ఆనుమానం వ్యక్తం చేస్తున్నారు. యేటా ఉపాధిహామీ ద్వారా కాలువల్లోని చెత్తను తొలగించినా.. కొద్దిరోజులకే యథాస్థితికి చేరుతోందని చెబుతున్నారు. ఉపకాలువల్లో తుంగ, చెట్లు పెరిగి సాగునీరు వెళ్లేందుకు ఆటంకం ఏర్పడుతోంది. మానకొండూర్ పరిధిలోని డీబీఎం– 2 సదాశివపల్లి రైస్‌మిల్లుల వద్ద వద్ద సిల్ట్ పేరుకుపోయి, సాగునీరు యేటా రోడ్డుపై పారుతోంది. మానకొండూర్‌లోని డీబీఎం–3 వద్ద కాలువకు గండిపడే ప్రమాదముంది. డీబీఎం–6 పరిధిలోని 4 ఎల్ ఉప కాలువ ఊటూరు నుంచి ఇప్పలపల్లికి వెళ్లే ఉపకాలువలో చెత్తపేరుకుపోవడంతో గండ్లు పడుతున్నాయి. గట్టుదుద్దెనపల్లి శివారులోని డీబీఎం–9 ఉపకాలువ పరిస్థితి కూడా అదే. పేరుకుపోయిన కాలువలపై అధికారులు దృష్టిపెట్టి, ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
మానకొండూర్ డీబీఎం–3 వద్ద కూలిన కల్వర్టు
సిల్ట్ట్‌తో నిండిఉన్న డీబీఎం–3 ఉపకాలువ
కాకతీయ కాలువ(ఫైల్)
చివరికి నీరందేనా?
చివరికి నీరందేనా?
చివరికి నీరందేనా?


