కొత్తవార్డులు ఏర్పాటు కాలేదట
● సమాచారం ఇవ్వలేక అధికారుల తప్పులు
సాక్షి ప్రతినిధి,కరీంనగర్: నగరంలో కొత్తగా వార్డులు ఏర్పాటు కాలేదట. సమాచార హక్కుచట్టం ద్వారా సామాజిక కార్యకర్త అడిగిన సమాచారానికి నగరపాలకసంస్థ అధికారులు ఇచ్చిన సమాధానం ఇది. నగరంలో కొత్తగా ఏర్పడిన 52వ డివిజన్ పరిధిలోని అధికారిక ఇంటినంబర్ల వివరాలు ఇవ్వాలని సామాజిక కార్యకర్త అన్నెమల్ల సురేశ్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆర్‌టీఐ ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. సీడీఎంఏ వెబ్‌సైట్‌ను చూసుకోవాలని అధికా రులు సమాధానం ఇచ్చారు. దీనిపై సురేశ్ అప్పీల్‌కు వెళ్లగా, అసలు కొత్తగా వార్డులే ఏ ర్పాటు కాలేదని సమాధానమిచ్చారు. నగరంలోని 60 డివిజన్లను 66 డివిజన్లుగా పునర్విభజన చేస్తూ జూన్ 21వ తేదీన, జీఓ నంబరు 144 ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. అధికారులు నిర్లక్ష్యపు సమాధానంతో పాటు, అసలు సమాచారమే తప్పుగా ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్‌టీఐ ద్వారా అడిగిన సమాచారం నగరపాలకసంస్థ అధికారులు ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని సామాజిక కార్యకర్త అన్నెమల్ల సురేశ్ విమర్శించారు. వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం అధికారికంగా ధృవీకరించబడిన రికార్డు కాదని, ప్రాపర్టీ టాక్స్, అసెస్‌మెంట్ రిజిస్టర్ ఆధారంగా ఉన్న అధికారిక ఇంటి నంబర్ల వివరాలే కావాలని తాను స్పష్టంగా కోరానన్నారు. సరైన సమాచారం ఇవ్వకపోవడంతో తాను ఫస్ట్ అప్పీల్ (ఎఫ్‌ఏఏ) దాఖలు చేయగా, మున్సిపల్‌కార్పొరేషన్‌లో కొత్త డివిజన్‌లు ఏర్పాటు చేయలేదని సమాధానం ఇచ్చారన్నారు. ఓ వైపు 66 డివిజన్లుగా పునర్విభజించి, మరో వైపు అసలు డివిజన్ల పునర్విభజనే లేదని సమాధానం ఇవ్వడం నగరపాలకసంస్థ పనితీరును తెలియజేస్తోందన్నారు.
వేగంగా నేరాల దర్యాప్తు
కరీంనగర్‌క్రైం: పోక్సో చట్టం కింద నమోదైన, మహిళలకు చెందిన నేరాల కేసుల్లో దర్యాప్తు వేగంగా పూర్తి చేయాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. మంగళవారం కమిషనరేట్‌లో నిర్వహించిన నేర సమీక్షలో పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చే ఆన్‌లైన్ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఎన్‌డీపీఎస్ కేసులు, ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్‌పై కఠినంగా వ్యవహరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహన తనిఖీలు ముమ్మరం చేయాలని, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సక్రమంగా నిర్వహించాలని సూచించారు. డిసెంబర్ 31న జరిగే వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజావాణికి దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, అదనపు డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు శ్రీనివాస్, మాధవి, విజయకుమార్, వెంకటస్వామి, సతీశ్‌కుమార్ పాల్గొన్నారు.
నల్లా సర్వే పూర్తి చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో చేపట్టిన నల్లా కనెక్షన్ల సర్వేను జనవరి 10వ తేదీలోగా పూర్తి చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. మంగళవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో రెవెన్యూ, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, వార్డు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జనవరి 10వ తేదీ లోగా అసెస్మెంట్ నంబర్ ప్రకారం వార్డు అధికారులు ఇంటింటికి తిరిగి నల్లా కనెక్షన్ సర్వే పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న నల్లా కనెక్షన్ కమర్షియలా? రెసిడెన్షియల్ నల్లానా అనేది పరిశీలించాలన్నారు. అక్రమ నల్లా కనెక్షన్‌లను తనిఖీ చేయడంతో పాటు నల్లా కనెక్షన్ సైజ్, నల్లా బిల్లుల బకాయిలతో పాటు ఇచ్చిన 26 కాలమ్స్ ఫార్మాట్‌లో వివరాలను సేకరించాలన్నారు. నల్లా కనెక్షన్‌కు మాన్యువల్ బుక్‌లేకున్నా, ఆన్ లైన్ ట్యాన్ నంబర్ లేకున్నా అక్రమ నల్లాగా గుర్తించి నోటీసులు జారీ చేయాలన్నారు. రెసిడెన్షియల్ నల్లా పొంది కమర్షియల్‌గా వాడినా, ట్యాప్ సైజ్ ఎక్కువగా ఉన్నా గుర్తించి నోటీసులు జారీ చేయాలన్నారు. ఆస్తి పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎన్‌పీడీసీఎల్ కమర్షియల్ మీటర్ల సర్వేను త్వరగా పూర్తి చేయాలన్నారు. డిప్యూటీ కమిషనర్లు, ఖాధర్ మొహియుద్దీన్, వేణుమాధవ్, సహాయ కమిషనర్ దిలీప్, ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఏసీపీ వేణు పాల్గొన్నారు.
కొత్తవార్డులు ఏర్పాటు కాలేదట


