రోడ్డు ప్రమాదంలో కోమాలోకి కూలి
బోయినపల్లి(చొప్పదండి): మండలకేంద్రానికి చెందిన బొడ్డు పర్శరాములు రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రగాయాలై కోమాలోకి వెళ్లడంతో వైద్యులు బ్రెయిన్ సర్జరీ చేశారు. అతడిది పేద కుటుంబం కావడంతో చికిత్సకు డబ్బు లేక దాతల సాయం కోసం కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. పర్శరాములు సుతారి పని చేసేవాడు. భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కొడుకు పుట్టుకతో దివ్యాంగుడు. రెండురోజుల క్రితం పర్శరాములు అతని భార్య బైక్‌పై కరీంనగర్ నుంచి ఇంటికి వెళ్తుండగా, బావుపేట వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొని ఇద్దరూ కిందపడ్డారు. పర్శరాములు తలకు తీవ్రగాయం కావడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా మెదడులో బోన్స్ విరిగి రక్తస్రావం కావడంతో ఆపరేషన్ చేశారు. రెండు రోజులకే రూ. 2 లక్షలు అయ్యాయి. బాధితుడు ఇంకా కోమాలోనే ఉన్నాడు. చికిత్సకు రూ.8 లక్షల వరకు డబ్బు కావాలి. బోయినపల్లి గ్రామ యువకులు వాట్సప్ గ్రూప్‌లో పెట్టిన పోస్టుకు స్పందించి పలువురు దాతలు సుమారు రూ.50 వేల వరకు సాయం చేశారు. సాయం చేసే దాతలు 94416 13675, 89191 85545 నంబర్లలో సంప్రదించాలని బాధితులు కోరారు.
రూ.8 లక్షల మేర ఆస్పత్రి ఖర్చులు
ఆదుకోవాలని కోరుతున్న కుటుంబీకులు


