మున్సిపల్ కసరత్తు
కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నగరపాలకసంస్థలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మొదలైంది. నగరంలోని 66 డివి జన్లకు సంబంధించిన ఓటర్ల జాబితాను పోలింగ్ బూత్‌ల ప్రకారం రూపొందించే పనిలో నగరపాలకసంస్థ అధికారులు నిమగ్నమయ్యారు. జనవరి 1వ తేదీన డివిజన్లవారీగా ఓటర్ల డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఇవ్వాల్సి ఉండడంతో, పెద్దసంఖ్యలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సవరణకు కుస్తీ పడుతున్నారు.
ప్రక్రియ వేగవంతం
సర్పంచ్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టడం తెలిసిందే. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల, పోలింగ్‌బూత్‌ల తయారీ ప్రక్రియను ప్రారంభించింది. ఓటర్ల జాబితా సవరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం కొత్త సంవత్సరం 1వ తేదీన డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా డ్రాఫ్ట్‌ను ప్రచురించాల్సి ఉంది. గడువుకు కేవలం రెండు రోజులే సమయం ఉండడంతో, నగర పాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ఆదేశాల మేరకు డ్రాఫ్ట్ రూపొందించేందుకు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మంగళవారం తమ పని ప్రారంభించారు.
డీలిమిటేషన్, ఓటర్ల జాబితా ఆధారంగా
నగరపాలకసంస్థ పరిధి విస్తరించడం, ఆరు గ్రామాలు, ఒక మున్సిపాలిటీ విలీనం కావడంతో నగరంలోని పాత డివిజన్లు మారిపోవడం తెలిసిందే. అప్పటికే ఉన్న 60 డివిజన్ల విలీనం అనంతరం 66 డివిజన్లుగా పునర్విభజించారు. దీంతో అన్ని డివిజన్ల సరిహద్దులు మారాయి. కొత్తగా పునర్విభజించిన 66 డివిజన్లకు అనుగుణంగా పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాను, ఈ– మ్యాపింగ్ 1వ తేదీలోగా రూపొందించనున్నారు. ఎన్నికల సంఘం తయారు చేసిన ఓటర్ల జాబితాను, పునర్విభజన జాబితాను ఆధారంగా తీసుకొని కొత్తగా డివిజన్లవారీగా ఓటర్ల జాబితాను రూపొందిస్తారు. ఎన్నికల సంఘం ప్రచురించిన ఓటర్ల జాబితాలో ఉన్న పేర్లు, ఇంటినంబర్ల ఆధారంగా, పునర్విభజన డివిజన్లలో ఉన్న ఇంటినంబర్లు, పేర్లతో సరిపోల్చుకొని, పోలింగ్‌బూత్‌ల వారీగా 66 డివిజన్ల ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. 1వ తేదీన ప్రచురించే ఓటర్ల డ్రాఫ్ట్‌పై అభ్యంతరాలు, పరిష్కారం అనంతరం జనవరి 10వ తేదీన డివిజన్లవారీగా తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు.
డివిజన్లవారీగా జాబితా సిద్ధం చేయాలి
డివిజన్లవారీగా పోలింగ్‌బూత్‌ల ప్రకారం ఓటర్ల జాబితాను రూపొందించాలని నగర పాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ఆదేశించారు. మంగళవారం నగరపాలకసంస్థ సమావేశ మందిరంలో పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఓటర్ల జాబితా సవరణపై పలు సూచనలు చేశారు. ఇచ్చిన ఓటరు జాబితా, డీలిమిటేషన్ డివిజన్ల ప్రకారం కొత్త ఓటర్ల జాబితా మ్యాపింగ్ చేయాలన్నారు.


