డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన విద్యార్థిని | - | Sakshi
Sakshi News home page

డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన విద్యార్థిని

Aug 12 2023 2:00 AM | Updated on Aug 12 2023 7:51 AM

- - Sakshi

కరీంనగర్: డీజే పాటలు.. స్నేహితులతో డ్యాన్సులు.. చుట్టూ కేరింతలు.. ఆనందంతో ఆడిపాడుతున్న ఓ బాలిక ఒక్కసారిగా కుప్పకూలింది. అధ్యాపకులు ఆస్పత్రికి తరలిస్తుండగా.. గుండెపోటుతో మరణించింది. గంగాధర మండలం కొండన్నపల్లి శివారులోని ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌లో విషాదం నెలకొంది. శుక్రవారం ఫ్రెషర్స్‌ డే వేడుకల్లో డ్యాన్స్‌ చేస్తూ విద్యార్థిని గుండు ప్రదీప్తి(16) గుండెపోటుతో మృతి చెందింది.

గంగాధర మండలంలోని వెంకటాయిపల్లి గ్రామానికి చెందిన గుండు అంజయ్య–శారదల కూతురు ప్రదీప్తి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోంది. శుక్రవారం కళాశాలలో ఫ్రెషర్స్‌ డే వేడుకల సందర్భంగా డ్యాన్స్‌ చేస్తూ.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ కుప్పకూలింది.

ఉపాధ్యాయులు వెంటనే సీపీఆర్‌ చేస్తూ.. గంగాధర ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌ తరలిస్తుండగా.. మార్గంమధ్యలో చనిపోయింది. ప్రదీప్తి చిన్నప్పుడే గుండెకు రంధ్రం ఉండగా.. మందులు వాడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement