రైతులు కట్టిన అడ్డు‘కట్ట’..! | - | Sakshi
Sakshi News home page

రైతులు కట్టిన అడ్డు‘కట్ట’..!

Nov 20 2026 2:18 AM | Updated on Nov 20 2026 2:18 AM

ఓదెల: ప్రభుత్వం పట్టించుకోకపోయినా.. సాగునీటి కోసం రైతులే నడుం బిగించారు. ఏడాది క్రితం గుర్తుతెలియని వ్యక్తులు పేల్చివేసిన గుంపుల మానేరు చెక్‌డ్యాంకు తమ సొంత డబ్బులతో మరమ్మతులు చేపట్టారు. యాసంగి సాగుకు నీటి కొరత రాకుండా తనుగుల, శంభునిపల్లె రైతులు ఐక్యంగా బండరాళ్లతో అడ్డుకట్ట వేస్తున్నారు. దీంతో మానేరులో నీటి నిల్వలు పెరిగి, భూగర్భజలాలు సమృద్ధిగా ఉండటంతోపాటు సుమారు 1,500 ఎకరాల సాగుకు ఊరట కలగనుంది. ఏడాది గడిచినా ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో రైతులే రంగంలోకి దిగి ఆదర్శంగా నిలిచారు.

పేల్చివేతతో నీటి కష్టాలు

ఓదెల మండలం గుంపుల, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల మధ్య మానేరులోని చెక్‌డ్యాంను గత ఏడాది నవంబర్‌ 21న గుర్తుతెలియని వ్యక్తులు పేల్చివేశారు. దీంతో నీటి నిల్వలు లేక భూగర్భజలాలు అడుగంటాయి. చెక్‌డ్యాం కింద తనుగుల, శంభునిపల్లె గ్రామాల్లో 200 ఎకరాలు, గుంపుల, గూడెం గ్రామాల్లో సుమారు వెయ్యి ఎకరాల ఆయకట్టు సాగుకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

సొంత డబ్బులతో మరమ్మతులు

యాసంగిలో వరి సాగు చేసేందుకు తనుగుల, శంభునిపల్లె రైతులు ఎకరాకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు విరాళాలు సేకరించి మరమ్మతులు చేపట్టారు. పేల్చివేతకు గురైన బండరాళ్లను ఫ్లోక్లెయిన్‌లతో పేర్చి నీరు వృథాగా పోకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. దీంతో మానేరులో నీటి నిల్వలు పెరిగి బా వుల్లో ఊటలు పెరుగుతాయని, వరి సాగుకు నీటి ఇబ్బందులు తగ్గుతాయని రైతులు ఆశిస్తున్నారు.

ప్రభుత్వం స్పందించాలి

చెక్‌డ్యాం పేల్చివేత అనంతరం ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రి హరీశ్‌రావు, నిజనిర్ధారణ కమిటీ సభ్యులు సందర్శించి ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లినా మరమ్మతులకు నిధులు మంజూరు కాలేదు. రైతులే ఐకమత్యంతో పనులు చేపట్టడంతో మానేరుకు ఇరువైపులా సాగు చేసే రైతుల్లో ఆశలు చిగురించాయి.

పేల్చివేతకు గురైన చెక్‌డ్యాంకు సొంత ఖర్చులతో మరమ్మతులు

ఏడాది గడిచినా నిధులు మంజూరు చేయని ప్రభుత్వం

యాసంగి సాగు కోసం తనుగుల, శంభునిపల్లె రైతుల చొరవ

1,500 ఎకరాల సాగుకు ఊరట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement