రామగుండం/పెద్దపల్లి: రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, విత్తనాలు, స్వల్ప, దీర్ఘ, మధ్యకాలిక రుణాలు, డిపాజిట్లు తదితర సేవలు మరింత చేరువ చేసేందుకు ప్రాథమిక వ్యవసా య సహకార పరపతి సంఘాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనేపథ్యంలో జిల్లా పరిధిలో కొలనూర్, తుర్కల మద్ధికుంట, అంతర్గాం, దొంగతుర్తి, గుంజపడుగు, రత్నాపూర్ తదిత ర కేంద్రాల్లో ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో మరికొంత మంది రాజకీయ నిరుద్యోగులకు పదవులు రానున్నాయి.
13 మందికి పదవులు
సహకార చట్టం ప్రకారం ప్రతీ పీఏసీఎస్ పాలకవర్గంలో చైర్మన్, వైస్ చైర్మన్, 11 మంది డైరెక్టర్లు ఉంటారు. కాగా ఇప్పటివరకు మేడిపల్లి వ్యవసాయ ప్రాథమిక సహకార పరపతి సంఘం పేరుతో ఉమ్మడి రామగుండానికి ఒక్కటే ఉండడంతో విస్తీర్ణం చాలా పెద్దదిగా మారింది. ప్రస్తుతం అంతర్గాం మండల కేంద్రానికి నూతనంగా పీఏసీఎస్ ఏర్పాటుతో రైతాంగం, రాజకీయ పార్టీ నేతల్లో హర్షం వ్యక్తమవుతుంది. పెద్దపల్లి నియోజకవర్గంలో ఓదెల మండలం కొలనూరు, పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట గ్రామాల్లో సొసైటీలు ఏర్పాటు కానున్నాయి. ఓదెల మండలం పోత్కపల్లి సింగిల్ విండో పరిధి నుంచి కొలనూరు, పెద్దపల్లి మండలం అప్పన్నపేట, పెద్దపల్లి సింగిల్ విండో పరిధి నుంచి తుర్కలమద్దికుంటను వేరు చేసి నూతన సొసైటీలుగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ విప్ విజయరమణారావు తెలిపారు.


