పెద్దపల్లి కలెక్టర్ డెవలప్మెంట్ చార్జీల పేరిట లారీలపై విధిస్తున్న లెవీ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. నిబంధనల ప్రకారం.. రూ.వందల్లో విధించాల్సి న చార్జీలను రూ.వేలకు పెంచి వసూలు చేస్తున్నారంటూ కొన్ని నెలలుగా ఆరోపిస్తున్న బాధితులు ఢిల్లీ గడప తొక్కారు. డెవలప్మెంట్ ఛార్జెస్ అండ్ అధిక సినరేజీ చార్జీల విషయంలో తాము దోపిడీకి గురవుతున్నామని ఇటుక బట్టీ యజమానులు, క్వారీ నిర్వాహకులు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. గతంలో తామెప్పుడూ ఇలాంటి చార్జీలు చెల్లించలేదని, ఇక చెల్లించడం తమ వల్ల కాదంటూ వాపోతున్నారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి కలెక్టర్‌పై ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి ఫిర్యాదు చేశారు. అక్కడ నుంచి ఫిర్యాదు ఏకంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌కు చేరిందన్న వార్త కలకలం రేపుతోంది.
–సాక్షిప్రతినిధి,కరీంనగర్..●
డెవలప్మెంట్ చార్జీల పేరిట కలెక్టర్ కార్యాలయం బూడిద, మట్టి లారీలపై వసూలు చేస్తున్న చార్జీలు రాజ్యాంగ విరుద్ధమని లారీ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. తాము ఇంట్లో బంగారం కుదవపెట్టి, ఫైనాన్స్‌లో లోన్లు తీసుకుని, నెలనెలా ఈఎంఐలు కడుతూ లారీలు నడిపిస్తున్నామంటున్నారు. నిబంధనల ప్రకారం.. క్యూబిక్ మీటరు 12 టైర్లు 18 క్యూబిక్ మీటర్లకు రూ.60 చొప్పున.. రూ.1,080 వసూలు చేయాలి. కానీ, లారీకి రూ.3,500 వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన నెల మొత్తం ఒక్కో బూడిద లారీ దాదాపు గరిష్టంగా రూ.60వేలకు పైగా చెల్లించాల్సి వస్తోందని వివరిస్తున్నారు. మట్టిదుబ్బను, మట్టిని తరలించే వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. ఆ వాహనాలను రూ.లక్షలు చెల్లించి విడిపించుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనిది ఇక్కడే ఎందుకు? ఏ గెజిట్, ఏ జీవో ప్రకారం వసూలు చేస్తున్నారని క్వారీ యజమానులు నిలదీస్తున్నారు. ఇప్పటి వరకూ బూడిదలారీలపై రూ.6 కోట్లు, మట్టి లారీలపై రూ.10 కోట్ల వరకు లెవీ, సినరేజీ కింద వసూలు చేశారని లారీ యజమానులు వాపోతున్నారు.


