కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా (రూ. 5 లక్షల బీమా) పథకానికి శుక్రవారం నగరంలో శ్రీకారం చుడుతున్నారు. ప్రత్యేక శిబిరాల ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. నగరంలోని 66 డివిజన్లకు గాను 32 ప్రాంతాల్లో జీవితబీమా శిబిరాలు ఏర్పాటు చేశారు. ఒకటి, రెండు, మూడు, నాలుగు డివిజన్లకు కలిపి ఒక ప్రాంతంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచే శిబిరాలు ప్రారంభం కానున్నాయి. శిబిరాల వారీగా అధికారులను ఇన్‌చార్జీలుగా నియమించారు. శుక్రవారం నుంచి 30 రోజుల పాటు ఈ శిబిరాలు కొనసాగున్నాయి.
సమర్థవంతగా అమలు చేయాలి: కమిషనర్ ప్రఫుల్ దేశాయ్
నగరపాలక సంస్థ పరిధిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో రెవెన్యూ, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, పారిశుధ్య విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ జీవిత బీమా రూ.5 లక్షల పథకాన్ని నగరంలో పకడ్బందీగా అమలు చేయాలన్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకే లోకేషన్ల ప్రకారం శిబిరాలు ప్రారంభించాలన్నారు. 18 నుంచి 59 ఏళ్ల లోపు వయస్సు గల కుటుంబ యజమాని రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవితబీమాకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రతి దరఖాస్తు ఐడీ నంబర్‌ను రిజిస్టర్‌లో రికార్డు చేయాలని, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, మొబైల్ నంబర్‌తో పాటు కుటుంబ సభ్యుల వివరాలతో దరఖాస్తులు పూరించాలన్నారు. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో డేటా ఎంట్రీ వేగవంతం చేయాలన్నారు. నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియుద్దీన్, వేణుమాధవ్, సహాయ కమిషనర్ రాజమనోహర్, ఈఈ లచ్చిరెడ్డి, డీసీపీ బషీర్ పాల్గొన్నారు.


