కరీంనగర్ అర్బన్: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాల సేకరణకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసింది. అర్హులైన ప్రతి కుటుంబాన్ని గుర్తించి, పూర్తి వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో గురువారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. శుక్రవారం నుంచే జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇంటింటి సర్వే ప్రారంభించాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శి, జీపీవో, డేటా ఎంట్రీ ఆపరేటర్ సభ్యులుగా ఉండే ఈ బృందాలు కుటుంబ యజమాని, నామినీ, కుటుంబ సభ్యుల పూర్తి సమాచారాన్ని నమోదు చేయాలని సూచించారు. మండలస్థాయిలో ఎంపీడీవోలు, ప్రత్యేక అధికారులు, ఎంపీవోలు పర్యవేక్షించాలని సూచించారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, డీఆర్వో స్వామి పాల్గొన్నారు.
డిసెంబర్‌లో ఖేలో ఇండియా జూడో పోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్: రాష్ట్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఖేలో ఇండియా నేషనల్ యూత్ గేమ్స్–2026 లోగో, మస్కట్, వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ చిత్రామిశ్రా ఆవి ష్కరించారు. సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటో దిగారు. డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు కరీంనగర్‌లో జూడో పోటీలు జరగనున్నాయని వెల్లడించారు. జాతీయస్థాయి క్రీడలకు ఆతిథ్యమివ్వడం గర్వకారణమని, యువత, క్రీడాకారులకు ఖేలో ఇండియాపై అవగాహన కల్పించాలని సూచించారు.


