75 మంది కొత్త కార్మికులు
ఆమోదం కోసం అత్యవసర సమావేశం
పది అంశాలతో ఎజెండా.. మరిన్ని టేబుల్ ఎజెండా
నేడు మేయర్ అధ్యక్షతన బల్దియా కౌన్సిల్
కరీంనగర్ కార్పొరేషన్: స్మార్ట్ సిటీ తర్వాత నగర అభివృద్ధికి మరో భారీ ప్రాజెక్టు సిద్ధమవుతోంది. రూ.840 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) పనులకు ఆమోదం, 75 మంది అదనపు పారిశుధ్య కార్మికుల నియామకానికి కరీంనగర్ బల్దియా కౌన్సిల్ సిద్ధమైంది. ఈ ప్రతిపాదనలకు తీర్మానాలు చేసి సీడీఎంఏ ఆమోదానికి పంపేందుకు శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు జరిగే సమావేశానికి పది అంశాలతో ఎజెండా రూపొందించారు. మరికొన్ని అంశాలు టేబుల్ ఎజెండాగా రానున్నాయి. నగరంలో పేరుకుపోయిన పారిశుధ్యం, రోడ్లు, డ్రైనేజీలు, వీధిదీపాలు, తాగునీటి సమస్యలపై సభ్యులు గళమెత్తే అవకాశం ఉంది.
రూ.840 కోట్లతో అభివృద్ధి పనులు
యూసీఎఫ్ కింద గతంలో రూ.1,100 కోట్లతో ప్రతిపాదనలు పంపగా, ప్రస్తుతం రూ.840 కోట్లకు ఆమోదం లభించింది. దీంతో మారిన నిధుల కేటాయింపునకు అనుగుణంగా ప్రతిపాదనలను సవరించి మరోసారి కౌన్సిల్ ఆమో దం పొందాల్సి ఉంది. టెండర్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా శుక్రవారం తీర్మానం చేసి సీడీఎంఏకు పంపనున్నారు.
కొత్తగా 75 మంది కార్మికులు
కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు ఆరు గ్రామాల విలీనంతో నగర విస్తీర్ణం 112 చదరపు కిలోమీటర్లకు, జనాభా 4,44,471కు చేరింది. డివిజన్ల సంఖ్య 66కు పెరిగింది. ఈ నేపథ్యంలో పారిశుధ్య నిర్వహణకు అదనపు సిబ్బంది అవసరమని గుర్తించారు. నిబంధనల ప్రకారం 1,244 మంది కార్మికులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 1,169 మంది మాత్రమే ఉన్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకు మరో 75 మందిని నియమించాలని ప్రతిపాదించారు. వీరి వేతనాల కోసం ఏటా రూ.1.74 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది.


