అవగాహనతోనే హెచ్‌ఐవీ నివారణ | - | Sakshi
Sakshi News home page

అవగాహనతోనే హెచ్‌ఐవీ నివారణ

Sep 22 2026 1:42 AM | Updated on Sep 22 2026 1:42 AM

అవగాహనతోనే హెచ్‌ఐవీ నివారణ దరఖాస్తుల ఆహ్వానం రేపు అండర్‌–20 కబడ్డీ జిల్లా బాలికల జట్టు ఎంపిక రైస్‌మిల్‌లో రేషన్‌ బియ్యం ఆర్ట్స్‌ కళాశాలలో సర్టిఫికెట్‌ కోర్సులు రేపు జాబ్‌మేళా

కామారెడ్డి టౌన్‌ : ప్రజల్లో సరైన అవగాహన కల్పించడం ద్వారా హెచ్‌ఐవీ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకోవచ్చని డీఎంహెచ్‌వో వెంకట్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం కొత్త బస్టాండ్‌లో కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు సంక్లిష్టమైన ఆరోగ్య అంశాలు, వ్యాధులపై సులభంగా అవగాహన కల్పించేందుకు కళాజాత, పల్లె సుద్దుల వంటి సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయన్నారు. జిల్లావ్యాప్తంగా వారం పాటు రోజూ రెండు చొప్పున ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్‌ ప్రదీప్‌, డిప్యూటీ డెమో వేణుగోపాల్‌, డీపీఎం సుధాకర్‌, ఐసీటీసీ కౌన్సిలర్లు నాగరాజు, నందిని తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌ : జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షల చేసేందుకు దినసరి వేతన ప్రాతిపదికన ఇద్దరు ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్లు లేదా ఆప్టోమెట్రిస్ట్‌ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌వో వెంకట్‌ సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ అంధత్వ, దృష్టిలోప నివారణ కార్యక్రమం కింద 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 373 పాఠశాలల్లో 51,693 మంది విద్యార్థులకు కంటి స్క్రీనింగ్‌ నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్‌ ఇన్‌ ఆప్టోమెట్రీ, డిప్లొమా ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌ విద్యార్హత ఉన్నవారు అర్హులని తెలిపారు. ఎంపికై న వారికి రోజుకు రూ. 1,000 వేతనం చెల్లిస్తామని, గరిష్టంగా 50 పని దినాలు లేదా ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు విధులు ఉంటాయని పేర్కొన్నారు. అర్హత గల అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లోగల డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

కామారెడ్డి అర్బన్‌: తాడ్వాయిలోని మహా గార్డెన్‌లో బుధవారం జిల్లా స్థాయి అండర్‌ –20 కబడ్డీ బాలికల జట్టు ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ చైర్మన్‌, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.భాస్కర్‌, బి.భాస్కర్‌, రాజు ఓ ప్రకటనలో తెలిపారు. 2006 జనవరి ఒకటో తేదీ తర్వాత జన్మించిన క్రీడాకారులు డ్రెస్‌కోడ్‌, మ్యాట్‌ షూతో పోటీలకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 99892 15251 నంబరులో సంప్రదించాలని సూచించారు.

కేసు నమోదు చేసిన అధికారులు

రామారెడ్డి: రెడ్డిపేటలోని రైస్‌మిల్‌లో సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల ద్వారా 638 సంచుల పీడీఎస్‌ బియ్యం పట్టుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ శేఖర్‌రెడ్డి తెలిపారు. రైస్‌మిల్‌ మేనేజర్‌ నరేశ్‌తోపాటు బియ్యం తరలిస్తున్న మునీందర్‌ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కోసం రామారెడ్డి పోలీసులకు కేసును అప్పగించామన్నారు. పట్టుకున్న బియ్యం సంచులను గోదాములకు తరలించారు.

కామారెడ్డి అర్బన్‌: కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల విద్యార్థులకు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో సర్టిఫికెట్‌ కోర్సులను ప్రారంభించారు. హోం నీడ్స్‌ కెమికల్స్‌, ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌ టూల్స్‌ కోర్సులను తొలుత ప్రారంభిస్తున్నామని, వీటి ఫలితాల ఆధారంగా మరిన్ని కోర్సులు ప్రవేశ పెడతామని ప్రిన్సిపల్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ కిష్టయ్య, లెక్చరర్లు మానస, శారద, దినకర్‌, రాజశ్రీ, శ్రీనివాస్‌, రాజశ్రీ, శ్రీలత, రాంప్రసాద్‌, అనిల్‌కృష్ణ, దేవేందర్‌, సమన్వయకర్త జయప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: రిలయన్స్‌ జియోలో 20 హోం సర్వీస్‌ ఉద్యోగాల కోసం బుధవారం ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్‌లో జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఉపాధి కల్పనాధికారి కిరణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ, డిప్లొమా చేసిన 18 నుంచి 25 ఏళ్లలోపు పురుషులు అర్హులని, పూర్తి వివరాలకు 93915 39320 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement