నిమజ్జనానికి వేళాయె! | - | Sakshi
Sakshi News home page

నిమజ్జనానికి వేళాయె!

Sep 23 2026 1:25 AM | Updated on Sep 23 2026 1:25 AM

నిమజ్జనానికి వేళాయె! ట్రాఫిక్‌ డైవర్షన్‌.. శోభాయాత్ర సాగుతుందిలా..

చెరువు వద్ద ఏర్పాట్లు..

కామారెడ్డి టౌన్‌ : వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. తొమ్మిది రోజుల పాటు ఘనంగా పూజలందుకున్న గణపయ్య.. గంగమ్మ ఒడికి చేరే సమయం ఆసన్నమైంది. జిల్లా కేంద్రంలో బుధవారం నిమజ్జనోత్సవాన్ని ప్రారంభించనున్నారు. రెండు రోజుల పాటు కనులపండువగా సాగే ఈ వేడుకకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది.

రెండురోజులపాటు..

జిల్లా కేంద్రంలో సుమారు 400లకుపైగా గణేశ్‌ విగ్రహాలను ప్రతిష్ఠించారు. బుధవారం ప్రారంభమయ్యే ఈ నిమజ్జనోత్సవాలు గురువారం రాత్రి వరకు కొనసాగనున్నాయి. స్థానిక టేక్రియాల్‌ చెరువులో విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం సిరిసిల్ల రోడ్డులోని ధర్మశాల వద్ద శోభాయాత్రను ప్రారంభించనున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ శోభాయాత్రను తిలకించడానికి సమీప గ్రామాల ప్రజలే కాకుండా, చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు తరలివస్తారు.

కామారెడ్డి క్రైం: శోభాయాత్ర సందర్భంగా జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి తాత్కాలికంగా ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్లు ఎస్పీ రాజేశ్‌ చంద్ర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 6 గంటల నుండి గణేష్‌ విగ్రహాల నిమజ్జన శోభాయాత్ర పూర్తయ్యే వరకు భారీ వాహనాలకు కామారెడ్డి పట్టణంలోకి ప్రవేశం లేదని పేర్కొన్నారు. శోభాయాత్ర జరిగే మార్గంలో కూడా ఎలాంటి వాహనాలకు అనుమతి ఉండదని తెలిపారు.

మళ్లింపు ఇలా..

● కరీంనగర్‌ వైపు నుంచి కామారెడ్డికి వచ్చే వాహనాలు సిరిసిల్ల రోడ్‌లో ఉన్న బైపాస్‌ నుంచి జాతీయ రహదారి గుండా టేక్రియాల్‌ బైపాస్‌ మార్గం ద్వారా పట్టణంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది.

● కామారెడ్డి నుంచి కరీంనగర్‌ వైపు వెళ్లే వాహనాలు కామారెడ్డి కొత్త బస్టాండ్‌ నుంచి ఇందిరాగాంధీ స్టేడియం మీదుగా టేక్రియాల్‌ బైపాస్‌ నుంచి సిరిసిల్ల బైపాస్‌ మార్గం ద్వారా వెళ్లాలి.

● కొత్త బస్టాండ్‌ నుంచి పాత బస్టాండ్‌ వైపు వెళ్లే వాహనాలు కొత్త బస్టాండ్‌ నుంచి అశోక్‌నగర్‌ రైల్వే గేట్‌ వరకు వచ్చి, కలెక్టర్‌ కార్యాలయం ముందు నుంచి గుమస్తా కాలనీ మీదుగా రామారెడ్డి వైపు, లేదా ఓం శాంతి భవనం వద్దనుంచి రాజీవ్‌నగర్‌ కాలనీ మీదుగా టీచర్స్‌ కాలనీ, ఇంద్రనగర్‌ కాలనీ వైపు వెళ్లవచ్చు.

● హైదరాబాద్‌ వైపు యథావిధిగా పాత మార్గం ద్వారానే వెళ్లాలి.

● హైదరాబాద్‌, పాత రాజంపేట వైపు నుంచి కామారెడ్డి పట్టణంలోకి వచ్చే వాహనాలు మాత్రం టేక్రియాల్‌ బైపాస్‌ మీదుగా ఇందిరాగాంధీ స్టేడియం ముందు నుంచి కొత్త బస్టాండ్‌ మార్గం ద్వారా పట్టణంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది.

శోభాయాత్రకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌ను అధికారులు విడుదల చేశారు. రైల్వే స్టేషన్‌లోని యువజన సమాఖ్య వినాయకుడితో ధర్మశాల వద్ద నిమజ్జనోత్సవ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి సిరిసిల్ల రోడ్‌, ఇందిరా చౌక్‌ మీదుగా సాగుతుంది. ఇందిరా చౌక్‌ వద్ద వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికపైన మండపాల నిర్వాహకులను సన్మానిస్తారు. అక్కడి నుంచి స్టేషన్‌రోడ్‌, సుభాష్‌ రోడ్‌, తిలక్‌ రోడ్‌, జేపీఎన్‌ చౌరస్తా, వీక్లీ మార్కెట్‌ రోడ్‌, పాంచ్‌ రస్తా, గోపాలస్వామి రోడ్‌, పెద్దబజార్‌, రైల్వే బ్రిడ్జి, అంబేడ్కర్‌ విగ్రహం, నిజాంసాగర్‌ చౌరస్తా, కొత్త బస్టాండ్‌ మీదుగా టేక్రియాల్‌ చెరువు వరకు శోభాయాత్ర సాగుతుంది. అనంతరం చెరువులో విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. మరికొన్ని విగ్రహాలను బాసరకు తరలిస్తారు.

టేక్రియాల్‌ చెరువు వద్ద మున్సిపల్‌ శాఖ ఆధ్వర్యంలో మూడు భారీ క్రేన్లు, ఒక డోజర్‌ను అందుబాటులో ఉంచారు. వీటి ద్వారా విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేస్తారు. భక్తులు నీటిలోకి దిగకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం చెరువు ప్రాంగణంలో ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎస్పీ పర్యవేక్షణలో ముగ్గురు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు, హోంగార్డులతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో మార్గమధ్యలో వేలాడుతున్న విద్యుత్‌ వైర్లను సరిచేసి, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా సిబ్బందిని మోహరించారు. మొత్తం ప్రక్రియను రెవెన్యూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

నేడు జిల్లాకేంద్రంలో వినాయక

విగ్రహాల నిమజ్జనోత్సవం ప్రారంభం

తరలిరానున్న భక్తులు

ఏర్పాట్లు చేసిన అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement