పన్ను వసూలుతో సేవలు మెరుగుపడేనా...
● బిచ్కుందలో పన్ను వసూలు
టార్గెట్ రూ.3 కోట్లు
● ఒకేసారి పన్నుల భారం పెరగడంతో
వ్యాపారుల్లో ఆందోళన
బిచ్కుంద: గ్రామ పంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీగా మారిన బిచ్కుంద బల్దియా ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈనేపథ్యంలో నిబంధనల ప్రకారం ఆస్తిపన్ను, వాణిజ్య పన్ను ఇతర రకాల రుసుమును లెక్కించి వసూలు చేసే ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ పన్నుల ద్వారా మున్సిపాలిటీకి ఆదాయం గణనీయంగా పెంచాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ. 3 కోట్ల వరకు ఆదాయం సమకూర్చాలనే అధికారులు టార్గెట్ నిర్దేశించుకున్నారు.
జీపీ నుంచి బల్దియాగా...
ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ పరిధిలో కొనసాగిన పన్ను బిచ్కుంద మున్సిపాలిటీగా మారడంతో పరిపాలన విధానాల్లోను మార్పులు వచ్చాయి. పట్టణంలో ఉన్న ఇళ్లు, వ్యాపార సముదాయాలు ఇతర ఆస్తులకు బల్దియా నిబంధనల ప్రకారం అధికారులు పన్ను నిర్ధారణ చేపడుతున్నారు. గత జీపీలో ఉన్న పన్నుతో పోలిస్తే కొత్త పన్నులతో ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుండటంతో ప్రజలు, చిరువ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారులు, అద్దె దుకాణాలపై ఆధారపడి జీవించే కుటుంబాలు కొత్త పన్ను విధానంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 10 ఫీట్లు వెడల్పు, పొడవు ఉన్న దుకాణానికి గతంలో రూ.200 పన్ను ఉండేది. ఇప్పుడు ఏకంగా అధికారులు సుమారు వెయ్యి నుంచి రూ.1200 పెంచనున్నారు. భూమి విలువ ప్రకారం 0.25 శాతం కమర్షియల్ టాక్స్ విధించడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. బల్దియాగా మారిన వెంటనే ఈస్థాయిలో పన్ను పెంచడం సరికాదని, విడతల వారీగా సర్దుబాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.12 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
ప్రజలు సకాలంలో పన్ను చెల్లించి బిచ్కుంద బ ల్దియా అభివృద్ధికి సహకారం అందించాలి. వసూలు చేసిన పన్నుతో మౌలిక సదుపాయాలు కల్పించడం జ రుగుతుంది. కనీసం రూ.3 కోట్లు పన్ను వసూలు చే యాలనే లక్ష్యంతో ఉన్నాం. గతంలో జీపీ పన్నుతో పో ల్చితే బల్దియా పన్ను ఎక్కువగా ఉంది. ప్రజలు, వ్యా పారస్తులు సహకారం అందించాలని కోరుతున్నాం.
– శ్రీనివాస్, రెవెన్యూ అధికారి, బిచ్కుంద
బల్దియా ఆదాయం పెంచుకోవడం అవసరమే అయినప్పటికి ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులకు అనుగుణంగా మౌలిక వసతులు, పట్టణ సేవలు అందించాలనే ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. డ్రెయినేజీ వసతులు, పారిశుద్ధ్యం, రోడ్ల పరిిస్థితి, కలుషితమైన తాగునీరు వంటి సమస్యలను పరిష్కరించడంలో బల్దియా పూర్తిగా విఫలమైందని ఆరోపణలు ఉన్నాయి. పన్ను వసూళ్లపై ఉన్న శ్రద్ధ సమస్యల పరిష్కరించడంలో లేదని ప్రజలు, కొంత మంది కౌన్సిలర్లు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అధికారులు పన్ను వసూళ్లతో పాటు మెరుగైన సేవలు అందించాలని ప్రజలకు కోరుతున్నారు.


