వాగులు, వంకలు పారినా...
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వానాకాలం ఆరంభంలో వర్షాలు కురియలేదు. నెలన్నర ఆలస్యంగా జిల్లాలో వానలు దంచికొట్టాయి. దీంతో వాగులు వంకలు పారాయి. మధ్యలో మూడు వారాలు వరుణుడు ముఖం చాటేసినప్పటికీ.. ఇటీవల కురిసిన ఒకటి రెండు వర్షాలతో పంటలకు మేలు జరిగింది. జిల్లాలో ఒకటి రెండు మండలాలు మినహా మిగతా అన్నిచోట్లా సాధారణ వర్షపాతం నమోదైంది.
తుఫానులపైనే ఆశలు...
జిల్లాలో రెండు మూడు రోజులుగా తుఫాను ప్రభావంతో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒకటి రెండు భారీ వర్షాలు కురిస్తే చెరువులు, కుంటలు నిండుతాయని రైతులు ఆశతో ఉన్నారు. జలనవరులన్నీ నిండితేనే యాసంగికి భరోసా ఉంటుందంటున్నారు. లేకపోతే పంటల సాగులో ఇబ్బందులు పడాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వర్షాకాలం సీజన్ మొదలైన జూన్ 1 నుంచి నేటి వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 762.4 మి.మీ.లు కాగా.. ఇప్పటివరకు 814.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. అంటే ఏడు శాతం అదనంగా వర్షాలు కురిశాయి. మద్నూర్, పెద్దకొడప్‌గల్ మండలాల్లో మాత్రం 25 శాతం లోటు వర్షపాతం రికార్డయ్యింది. సదాశివనగర్, రామారెడ్డి, కామారెడ్డి, బీబీపేట, మహ్మద్‌నగర్ మండలాల్లో సాధారణం కన్నా కాస్త ఎక్కువ వర్షం కురిసింది. మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యింది.
కొన్ని ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వరదలొచ్చాయి. వాగులు పొంగి ప్రవహించాయి. జిల్లాలో కురిసిన వర్షాలతో వరదలొచ్చినప్పటికీ చాలా చెరువులు వెలవెలబోతున్నాయి. కాలువలు చాలాచోట్ల ఆక్రమణలకు గురవడం, కొన్నిచోట్ల ఆనవాళ్లు కోల్పోవడం, మరికొన్నిచోట్ల చెట్లు, పొదలతో నిండిపోవడంతో చాలావరకు నీరు చెరువుల్లోకి చేరలేదు. జిల్లాలో 1,426 చెరువులు, కుంటలు ఉండగా.. 46 చెరువులు మాత్రమే అలుగులు పారాయి. ఇందులో సదాశివనగర్‌లో 11, తాడ్వాయిలో 11, నాగిరెడ్డిపేటలో తొమ్మిది, గాంధారిలో తొమ్మిది, రామారెడ్డిలో మూడు, కామారెడ్డిలో మూడు చెరువులు, కుంటలు అలుగులు పారినట్టు నీటిపారుదల శాఖ నివేదికలు చెబుతున్నాయి. 46 చెరువులు అలుగులు పారగా.. 423 చెరువుల్లో యాభై శాతం నుంచి 75 శాతం దాకా నీరొచ్చింది. రెండు వందల చెరువులు సగం కూడా నిండలేదు. మరో 102 చెరువుల్లో కొద్దిపాటి నీరు వచ్చింది. ప్రాజెక్టుల్లోకి నీరొచ్చినా, చెరువులు, కుంటలు నిండకపోవడం విచిత్రంగా భావిస్తున్నారు.
జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు
ఇప్పటిదాకా అలుగెల్లింది
46 చెరువులే...
భారీ వర్షాలు కురిస్తేనే
యాసంగికి భరోసా


