నిజాంసాగర్: నాగమడుగు ఎత్తిపోతల పైప్‌లైన్ ఏర్పాటుకు సంబంధించి భూనిర్వాసితులకు ఎకరానికి రూ. 17.42 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తున్నామని బాన్సువాడ ఆర్డీవో రవీందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఈ పరిహారం ఎకరానికి రూ.16.9 లక్షల చొప్పున ఉండేదని, మార్కెట్ విలువకు అనుగుణంగా దానిని పెంచామని పేర్కొన్నారు. ఒడ్డేపల్లి, జక్కాపూర్‌లకు చెందిన రైతులకు రూ. 73.20 లక్షల విలువైన చెక్కులు వచ్చాయన్నారు.
జాయింట్ సర్వే..
మల్లూర్ శివారులోని 765 సర్వే నంబర్‌లోని భూముల సమస్య పరిష్కారానికి రెవెన్యూ, అటవీశాఖ జాయింట్ సర్వే పూర్తి చేస్తామని ఆర్డీవో తెలిపారు. మంగళవారం మల్లూర్‌లో 765 సర్వే నంబర్‌లోని భూములకు సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించారు. జాయింట్ సర్వేకు రైతులు సహకరించాలని కోరారు. ఆయన వెంట మల్లూర్ సర్పంచ్ శారద, తహసీల్దార్ భుజంగరావు తదితరులున్నారు.


