బూర్గుల్‌లో రక్షాబంధన్
నిజాంసాగర్: మహమ్మద్ నగర్ మండలం బూర్గుల్ గ్రామంలో బుధవారం విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్(రాఖీ) పండుగ నిర్వహించారు. చిన్నారులు, యువతి, యువకులు రాఖీలు కట్టుకొని సోదరభావాన్ని చాటుకున్నారు.
గంగపుత్ర విద్యార్థులకు అభినందన
కామారెడ్డి అర్బన్: క్రమశిక్షణతో కూడిన విద్య వ్యక్తిని ఉన్నతంగా నిలబెడుతుందని గంగపుత్ర ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ ఎం.రాజన్న అన్నారు. బుధవారం జిల్లా సీనియర్ సిటిజన్స్ ఫోరం భవనంలో గంగపుత్ర ఉద్యోగుల సర్వసభ్య సమావేశం జిల్లా అధ్యక్షుడు పాక వెంకటి అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం ఎస్‌ఎస్‌సీ ఇంటర్,డిగ్రీ 25 మంది గంగపుత్ర ప్రతిభ విద్యార్థులను అభినిందించారు. రాష్ట్ర నాయకులు పూస మల్లేశం, జి.మల్లికార్జున్, ఈ.గోపి, గుండు వెంకటేష్‌లు మాట్లాడారు. సంఘం జిల్లా ప్రతినిధులు శంకర్, ప్రవీణ్‌కుమార్, పోచన్న, కిషన్, ఎల్లేషం, ప్రవీణ్, రాజలింగం, గిర్మబోయి, రాజగోపాల్, జుగల్‌కిషోర్, ఆయా గ్రామాల గంగపుత్ర ప్రతినిధులున్నారు.
రక్తదాత బాలుకు వాసవి నవరత్న అవార్డు
కామారెడ్డి అర్బన్: రక్తదానంలో విశేషసేవలు అందిస్తున్న కామారెడ్డికి చెందిన బాలు కు హైదరాబాద్ వాసవి ఆర్ట్ థియేటర్స్ ‘వాసవి నవరత్న అవార్డు’ ను అందజేసింది. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సెంట్రల్ అడ్వయిజరీ బోర్డు చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా, వాసవి ఆర్ట్ థియేటర్స్ చైర్మన్ నీల శ్రీధర్ చేతుల మీదుగా బుధవారం ఆయన అవార్డును అందుకున్నారు. బాలు గత 19 ఏళ్లుగా 84 సార్లు రక్తదానం చేయడంతో పాటు, కామారెడ్డి రక్తదాతల సమూహం ద్వారా 6వేల యూనిట్ల రక్తం సేకరించారు.
ఏఐటీయూసీ జిల్లా నూతన కమిటీ ఎన్నిక
కామారెడ్డి టౌన్ : ఏఐటీయూసీ జిల్లా 4వ మహాసభల సందర్భంగా నూతన జిల్లా కార్యవర్గాన్ని బుధవారం రాష్ట్ర కార్యదర్శి ఎస్.బాలరాజు ఒక ప్రకటనలో ప్రకటించారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా పి. బాలరాజు, జిల్లా అధ్యక్షుడిగా బి. బాల్‌రాజు, ప్రధాన కార్యదర్శిగా ఎల్. దశరథ్, జిల్లా ఉపాధ్యక్షుడిగా సీహెచ్. భీమ్‌రామ్, దుబాస్ రాములు, రాజిరెడ్డి, ఆర్. లక్ష్మణ్, జిల్లా సహాయ కార్యదర్శులుగా ఎం. లక్ష్మణ్, ఎండి. ఖదీర్, సునీత, ఆముదాల గంగాధర్, కోశాధికారిగా ఎండి. రఫీలతో పాటు మరో 26 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తామని నూతన కమిటి ప్రకటించింది.
విద్యుత్ సమస్యలు పరిష్కారం
లింగంపేట : మండల కేంద్రంలో గత కొంత కాలంగా నెలకొన్న విద్యుత్ సమస్యలను బుధవారం విద్యుత్ సిబ్బంది పరిష్కరించారు. బస్టాండ్ ప్రాంతంలో, అంబేడ్కర్ చౌరస్తా, జలరాం హోటల్, ఎల్లమ్మ టెంపుల్ తదితర ప్రాంతాల్లో వంగిన విద్యుత్ స్తంభాలు, లూజ్ వైర్లు సరిచేశారు. అలాగే విద్యుత్ తీగలకు అడ్డంకిగా మారిన చెట్ల కొమ్మలను తొలగించారు. ఏఈ ధర్మేదర్, సబ్ ఇంజనీరు భాస్కర్, పీరయ్య, వహీద్, సిబ్బంది పాల్గొన్నారు.
బాజిరెడ్డి గోవర్ధన్‌పై అనుచిత వ్యాఖ్యలు తగవు
బాన్సువాడ రూరల్: బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్‌పై అనుచిత వ్యాఖ్యలు తగవని ఆపార్టీ నాయకులు అన్నారు. వర్ని మండలం తగిలేపల్లి మాజీ సర్పంచ్ వెంకట్ హత్య పూర్తిగా భూతగాదాల నేపథ్యంలో జరిగిందని పోలీసులు చెబుతున్నా ఆపార్టీ నాయకుడు పోచారం భాస్కర్‌రెడ్డి శవరాజకీయాలు చేస్తూ బీఆర్‌ఎస్ నేతలపై నిందలు వేస్తున్నారని అన్నారు. పోచారం భాస్కర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం వారు బాన్సువాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాయకులు మహ్మద్ జుబేర్, అంజిరెడ్డి, ఖలీల్, సాయిబాబ, అక్బర్, గణేష్, బాడి శ్రీనివాస్, షఫీ, శివసాయిలు తదితరులు పాల్గొన్నారు.
శబరిమాత ఆశ్రమంలో భోజనశాల నిర్మాణానికి భూమి పూజ
తాడ్వాయి : మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమం ఆవరణలో భోజనశాల, వసతిగృహం నిర్మాణానికి బుధవారం ఆలయ కమిటీ సభ్యులు భూమి పూజ చేశారు. చందాదారుల ఇచ్చిన రూ. 5 కోట్ల విరాళాలతో భోజనశాల నిర్మిస్తున్నామని, నిర్మాణం త్వరగా పూర్తి అయ్యేలా చూస్తామని వారు పేర్కొన్నారు. ఆలయకమిటీ అధ్యక్షుడు ఆనంద్‌రాం, సభ్యులు రాజు, శ్రీనివాస్, పండరి, యాదవరెడ్డి, రాంలింగం, రాఘరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బీపీ మండల్‌కు ఘన నివాళి
ఎల్లారెడ్డిరూరల్: పట్టణంలోని బీసీ బాలుర హాస్టల్‌లో బీపీ మండల్ జయంతిని బుధవారం బీఎస్పీ నాయకులు నిర్వహించారు.ఈసందర్భంగా మండల్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. జిల్లా బీసీ ప్రధాన కార్యదర్శి లింగమయ్య , కనీరాం, బీఎస్‌పీ నాయకులు సాయిబాబా, వార్డెన్ శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ కార్యవర్గాల ఏర్పాటు
మాచారెడ్డి: మండలంలోని ఘన్ పూర్,లచ్చాపేట గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ నూతన కార్యవర్గాలను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఘన్‌పూర్ అధ్యక్షుడిగా మద్దికుంట మహేష్, ఉపాధ్యక్షుడిగా సిరికొండ బాబు, ప్రధాన కార్యదర్శిగా మద్దికుంట సుధాకర్, కోశాధికారిగా సిరికొండ నర్సింలు, కార్యదర్శులుగా సిరికొండ కిషోర్, బట్టు నరసింహులు, బుద్ధుల రాజు, గౌరవ అధ్యక్షునిగా మద్దికుంట వెంకటరమణ ఎన్నికయ్యారు. మండల నాయకులు పొదర్ల రవి, జాన్, గడ్డం బాబు, సురేష్ ఉన్నారు. ఎమ్మార్పీఎస్ లచ్చాపేట గ్రామ అధ్యక్షుడిగా అల్లం మహిపాల్,ఉపాధ్యక్షుడిగా ప్రేమ్ చందు, ప్రధాన కార్యదర్శిగా రాజు, కోశాధికారిగా మంద సత్యం, కార్యదర్శులుగా అల్లం రవి, ప్రశాంత్, రాజేష్ ,రాజలింగం మహేష్, మంద బాలయ్య, అల్లం దేవరాజు గౌరవాధ్యక్షుడిగా సంఘం ఊరడయ్యలను ఎన్నుకున్నారు.
ఎల్లారెడ్డి వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ ప్రఖండ కమిటీ...
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ ప్రఖండ కమిటీని ఎన్నుకున్నట్లు ఇందూర్ విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణ తెలిపారు. పట్టణంలోని కిరాణ వర్తక సంఘంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో వీహెచ్‌పీ కార్యదర్శిగా బాలరాజ్, సహాయ కార్యదర్శిగా భువనేశ్వర్ సత్సంగ్ ప్రముఖ్‌గా పంతంగి కిరణ్, సహప్రముఖ్‌గా జగదీష్, సామాజిక సమరసత ప్రముఖ్‌గా పట్టెం కిషన్ బజరంగ్‌దళ్ సంయోజక్‌గా సందీప్, సహ సంయోజక్‌గా అరుణ్, హర్షవర్ధన్, గోరక్షక్ ప్రముఖ్‌లుగా గోపి, ప్రకాష్, దుర్గావాహిని సహసంయోజికగా శ్రీలక్ష్మి బాల సంస్కార కేంద్ర ప్రముఖ్‌గా మహాలక్ష్మి నియమితులయ్యారు.


