రోగాలు వెంటాడుతున్నాయి
వాతావరణ పరిస్థితులే కారణం
● ఆందోళన చెందుతున్న రైతులు
● భారమవుతున్న పెట్టుబడి ఖర్చులు
నిజాంసాగర్(జుక్కల్): ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ, ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలోనూ ఖరీఫ్ సీజన్ పంటల సాగు ఆశాజనకంగా సాగుతున్నాయి. చెరువులు, కుంటలత పాటు ప్రధాన జలాశయాలు, వ్యవసాయ బోరుబావులు, ఎత్తిపోతల పథకాల కింద లక్ష్యంమేర రైతులు పంటలు సాగు చేశారు. కానీ ప్రస్తుతం వరిలో తెగుళ్ల బెడద రైతులను ఆందోళన రేకెత్తిస్తోంది. అన్నదాతలు తగు జాగ్రత్తలు తీసుకుని పంట నష్టపోకుండా చూసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లావ్యాప్తంగా 5.53 లక్షల ఎకరాలు..
ఖరీఫ్ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 5.53 లక్షల ఎకరాల్లో వరి, ఆరుతడి రైతులు పంటలు పండిస్తున్నారు. అందులో 3.19 లక్షల ఎకరాల్లో వరి పంటను ప్రధానంగా సాగు చేశారు. పత్తి 45,864 ఎకరాల్లో, సోయా 87,736 ఎకరాల్లో, మొక్కజొన్న 47,237 ఎకరాల్లో, కంది 48,623 ఎకరాల్లో, మినుము 1,853ఎకరాల్లో, పెసర 2,198ఎకరాల్లో, చెరుకు 558ఎకరాల్లో, పొద్దుతిరుగుడు 35ఎకరాల్లో, జొన్న 8ఎకరాల్లో పంటలు సాగు చేశారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరి పంటకు అనుకూలించకపోవడంతో చీడపీడల బెడద అధికం అయ్యింది. రోజంతా ఎండవేడిమి, రాత్రి వర్షం చినుకులు పడుతుండటంతో వరి పైర్లు తెగుళ్ల బారిన పడుతున్నాయి. మొగిపురుగు, పచ్చ పురుగు, తాటిఆకు తెగుళ్లు పంటను ఆశిస్తున్నాయి. మొగి పురుగు దెబ్బకు వరి పైరు కుళ్లిపోయి పంట నాశనం అవుతుంది. అంతేకాకుండా పచ్చ పురుగు, తాటిఆకు తెగుళ్లతో పైర్లు రంగుమారుతున్నాయి. చీడపీడల నివారణ కోసం రైతులు పురుగు మందులను పిచికారి చేస్తున్నారు. తెగుళ్ల నివారణకు సరైన మందులు పిచికారి చేయక పంటలు దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు. పంటల సాగుకోసం పెట్టుబడి ఖర్చులు రైతులకు భారం అవుతున్నాయి. అయినా రైతులు వెనుకంజ వేయకుండా పంటను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
వరుణదేవుడిపై భారం వేసి, చెరువులు, కుంటలు, బోర్ల కింద వరి నాట్లు వేసుకున్నాం. వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు నిండి బోర్లు నీళ్లు పోస్తున్నాయి. పంటలు పచ్చదనంతో ఉన్నా తెగుళ్లు సోకుతున్నాయి. మొగి పురుగు బెడద ఎక్కువగా ఉంది. పురుగు మందు పిచికారి చేసినా తెగుళ్లు పోవడం లేదు.
–గొల్ల మల్లయ్య యాదవ్, రైతు, నర్వ
వర్షాలు కురిసిన తర్వాత ఒక్కసారిగా మారిన వాతావరణ పరిస్థితుల వల్ల వరి పంటలో మొగిపురుగు, పచ్చ పరుగులు, తాటాకు తెగుళ్ల ఆశించే అవకాశం ఉంది. మొగి, పచ్చపురుగుకు నివారణకు క్లోరోపైరీపాస్ 500 మి.లీ మందు లేదా ల్యామ్డ సైహలోత్రిన్ మందు ఎకరానికి 300మి.లీ పిచికారి చేయాలి. ఉధృతి అధికంగా ఉంటే కార్టప్ హైడ్రోక్లోరైడ్ మందును ఎకరానికి 400 మి.లీ పిచికారి చేయాలి. తాటకు తెగులుకు ప్రొఫెనోపాస్ మందు 400మి.లీ ఎకరానికి పిచికారి చేయాలి. అధిక వర్షాల వల్ల పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
–మోహన్‌రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, కామారెడ్డి


