● విద్యాభారతి సంయోజక్
హరిస్మరణ్‌రెడ్డి
ఎల్లారెడ్డిరూరల్: యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉన్నదని, వారితోనే దేశం అభివృద్ధి చెందుతుందని విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర పూర్వ విద్యార్థి పరిషత్ సంయోజక్ హరిస్మరణ్‌రెడ్డి అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎల్లారెడ్డిలో గురువారం నిర్వహించిన హిందూ యువ సమ్మేళన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువకులు దేశం కోసం, సమాజం కోసం సమయం కేటాయించాలన్నారు. కార్యక్రమంలో రెడ్డి సాయిలు, బజరంగ్‌దళ్ కార్యకర్తలు, వివిధ గ్రామాల యువకులు తులసి, వినోద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
మాచారెడ్డి: సేంద్రియ పంటలే మానవాళికి శ్రేయస్కరమని డీఆర్డీవో దామోదర్ రెడ్డి అన్నారు. మండలంలోని కొత్తపల్లిలో శ్రీకాంత్ రెడ్డి అనే యువ రైతు వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఫాం పాండ్‌లో నీటిని నిల్వ చేసుకొని దాంట్లో పెంచుతున్న చేపలను పరిశీలించారు. సేంద్రియ ఎరువులతో పండిస్తున్న కూరగాయలు, డ్రాగన్ ఫ్రూట్, కొబ్బరితోపాటు జిల్లాలోనే మొట్ట మొదటిసారిగా గ్యాక్ ఫ్రూట్ సాగును చూసి శ్రీకాంత్ రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో ఏపీవో సాయిబాబా, పంచాయతీ కార్యదర్శి జీవన్, సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ ఐలయ్య పాల్గొన్నారు.
నిజాంసాగర్(జుక్కల్): సింగితం రిజర్వాయర్ నీరు వృథా కాకుండా నీటిపారుదల శాఖ సిబ్బంది మట్టి, మొరం బస్తాలతో అడ్డుకట్ట వేస్తున్నారు. నర్వ గ్రామ శివారులో మూడేళ్ల కిందట రిటెయినింగ్ వాల్ కొట్టుకుపోవడంతో సాగు జలాలు వృథా అవుతున్నాయి. రిటెయినింగ్ వాల్‌తోపాటు బుంగల ద్వారా నీరు వృథా కాకుండా నాలుగు రోజులుగా సిబ్బంది మట్టి, మొరం బస్తాలను అడ్డుగా వేస్తున్నారు. రిజర్వాయర్ నీటిమట్టాన్ని తగ్గించి తాత్కాలిక పనులు చేపట్టారు. అయితే, ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద వస్తే తాత్కాలిక బస్తాలు తట్టుకోలేవని, శాశ్వత మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): ప్రార్థన సమయానికి హాజరుకాని ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. సదాశివనగర్ మండలం ధర్మారావ్‌పేట్ ఉన్నత పాఠశాలను ఈ నెల 7న స్థానిక సర్పంచ్ ఉమర్ తనిఖీ చేయగా, ప్రార్థన సమయంలో ఇద్దరు ఉపాధ్యాయులు గైర్హాజరయ్యారు. ఈ విషయమై ఎంఈవో దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఉపాధ్యాయులకు గురువారం షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు ఎంఈవో యోసెఫ్ తెలిపారు.


