కామారెడ్డి టౌన్ : వందేమాతర గీతం 150 ఏళ్ల ఉత్సవాలు, 80వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ప్రజల్లో దేశభక్తిని, జాతీయ ఐక్యతను చాటేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టారు. గాంధీ గంజ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. జేపీఎన్ రోడ్, సుభాష్ రోడ్, తిలక్ రోడ్, సిరిసిల్ల రోడ్, స్టేషన్‌రోడ్, రైల్వే కమాన్ మీదుగా నిజాంసాగర్ చౌరస్తా వరకు సాగింది. చేతుల్లో త్రివర్ణ పతాకాలు ధరించిన ప్రజలు.. ‘భారత్ మాతాకీ జై’, ‘వందేమాతరం’ నినాదాలు ఇస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కౌన్సిలర్లు, వ్యాపారులు, యువకులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.


