వామ్మో.. కూరగాయలు
పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. పెరిగిన ధరలను చూసి నిత్యావసరాలు కొనాలంటేనే జంకుతున్నారు. ఇటీవలి కాలంలో బియ్యంతో పాటు పప్పులు, నూనెల ధరలు పెరిగాయి. ఇదే సమయంలో ఉల్లి ఘాటెక్కగా.. వెల్లుల్లి, అల్లం ధరలు సైతం చుక్కలు చూపుతున్నాయి. కూరగాయల ధరలూ తక్కువేం లేవు. ఇంటి అద్దెలు ఇప్పటికే అడ్డగోలుగా పెరిగి కూర్చున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎలాగోలా మధ్యతరగతి నెట్టుకొస్తుండగా, కూలీనాలీ చేసుకొని బతికే పేదల పరిస్థితి దయనీయంగా మారింది.
ఉల్లి.. మళ్లీ కన్నీళ్లు పెట్టిస్తోంది..
మార్కెట్‌లో ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. కిలో తెల్ల ఉల్లిగడ్డను రూ.50 కి అమ్ముతున్నారు. ఎర్ర ఉల్లి కిలోకు రూ.40 పలుకుతోంది. కిలో వెల్లుల్లి రూ.280 నడుస్తోంది. పావుకిలో కావాలంటే రూ.80 కి అమ్ముతున్నారు. అల్లం కిలో రూ.240 కి చేరింది. పావుకిలో అంటే రూ. 70 కి తక్కువ ఇవ్వడం లేదు. దీంతో పేద, మధ్య తరగతివారు వంటలో ఉల్లి, అల్లం, వెల్లుల్లి వాడకాన్ని తగ్గిస్తున్నారు.
మాంసం ధరలూ అదే దారిలో..
కోడిగుడ్డు, చికెన్ ధరలు కూడా ఎక్కువే. మొన్నటి వరకు రిటేల్ మార్కెట్‌లో ఒక కోడిగుడ్డు ధర రూ.8 ఉండగా.. ప్రస్తుతం కాస్త తగ్గింది. కిలో చికెన్ ధర రూ.280 నుంచి రూ.320 వరకు ఉంది. మేక, గొర్రె మాంసం ధర కిలోకు రూ. 860 ఉంది.
జిల్లాలో సన్నబియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. మొన్నటి వరకు హెచ్‌ఎంటీ క్వింటాలుకు రూ.6,200 ఉండగా, ఇప్పుడు రూ.6,600 కు చేరింది. రూ. 400 పెరిగింది. ఇతర సన్నరకాల ధరలూ క్వింటాలుకు రూ.500 నుంచి రూ.700 వరకు పెరిగాయి. కందిపప్పు కిలో రూ.130 ఉండగా, రూ.10 పెరిగి రూ.140 కి చేరింది. కొన్నిచోట్ల రూ.150 కూడా అమ్ముతున్నారు. మినపప్పు కిలో రూ.130 ఉండగా, ఇప్పుడు రూ.148 కి చేరింది. శనగపప్పు కిలో రూ.75 ఉండగా, రూ. 85 కి విక్రయిస్తున్నారు. రిఫైన్డ్ ఆయిల్స్ లీటర్ ప్యాకెట్ ధర రూ.170 ఉండగా, ఇప్పుడు రూ.178 కి చేరింది. చక్కెర ధర హాఫ్ సెంచరీ దాటింది. ఇతర కిరాణ వస్తువుల ధరలూ గణనీయంగా పెరిగాయి.
టమాట ధర కిలోకు రూ. 30 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. కిలో మిర్చి ధర రూ.60 నుంచి రూ. 80 పలుకుతోంది. చిక్కుడు, బెండ, బీర, కాకర ధరలు కూడా కిలో రూ. 50 పైనే ఉన్నాయి. కొత్తిమీర, పూదీన కూడా ఎక్కువే. మార్కెట్‌కు వెళ్లి బస్తా నిండా కూరగాయలు తెచ్చుకునే వారు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఓవైపు పిల్లల స్కూల్ ఫీజుల మోత.. మరోవైపు పంటల సాగుకు అయ్యే పెట్టుబడులు పెరిగి ఇబ్బందుల్లో ఉన్న సామాన్యులు.. నిత్యావసరాలు, కూరగాయల ధరలు సైతం గణనీయంగా పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. నెలవారీ ఖర్చులకు సంబంధించిన బడ్జెట్ తలకిందులైందని ఆవేదన చెందుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
అడ్డగోలుగా పెరిగిన
నిత్యావసరాల ధరలు
సన్నబియ్యం క్వింటాలుపై
రూ.400 పెరుగుదల
పప్పులు, నూనె ధరలకూ రెక్కలు
కూరగాయల ధరలూ ౖపైపెకి..
ఉల్లి, అల్లం, వెల్లుల్లి..
ఏవీ కొనలేని పరిస్థితి
ఇబ్బందిపడుతున్న సామాన్యులు


