వరి వైపే మొగ్గు! | - | Sakshi
Sakshi News home page

వరి వైపే మొగ్గు!

Aug 13 2026 1:15 AM | Updated on Aug 13 2026 1:15 AM

వరి వైపే మొగ్గు!

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న వాతావరణ శాస్త్రవేత్తల హెచ్చరికలతో ప్రభుత్వం రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లించే ప్రయత్నాలు చేసింది. అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. అయితే జిల్లాలో ఇటీవల దంచికొట్టిన భారీ వర్షాలతో అంతటా జలకళ సంతరించుకుంది. ఇప్పటి వరకు సాధారణంకన్నా 32 శాతం అదనంగా వర్షపాతం నమోదైంది. దీంతో రైతులు ఆలస్యమైనా వరి నాట్లు ముమ్మరం చేశారు. జిల్లాలో ఇప్పటికే 2,75,032 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ఇంకా సాగు పనులు నడుస్తూనే ఉన్నాయి. ఈసారి కూడా వరి సాగు 3 లక్షల ఎకరాలు దాటే అవకాశాలున్నాయి.

భారీ వర్షాలతో మారిన పరిస్థితి..

ఇటీవల జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. పోచారం ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీ నుంచి అలుగులు పారే స్థాయికి చేరుకుంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు కూడా ఇన్‌ఫ్లో రావడంతో 12 టీఎంసీల నీటి మట్టానికి చేరువైంది. వాగులు, వంకలన్నీ పొంగి పొర్లాయి. జిల్లాలో సగానికిపైగా చెరువులు, కుంటలు అలుగులు పారాయి. భూగర్భ జలమట్టం కూడా క్రమంగా పెరుగుతోంది. దీంతో రైతులు వరి సాగుకే మొగ్గు చూపారు. వర్షాల్లేక వరి సాగు విషయంలో వెనకడుగు వేసిన రైతులు.. ఇప్పుడు నారు ముదిరిపోయినా సరే నాట్లు వేసేస్తున్నారు. కొందరు రైతులు నారు ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్లి కొనుక్కొచ్చి మరీ నాట్లు వేస్తున్నారు. దీంతో వరి సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. రాజంపేట, తాడ్వాయి, గాంధారి, లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, దోమకొండ, మాచారెడ్డి, పాల్వంచ, నిజాంసాగర్‌, మహ్మద్‌నగర్‌, బిచ్కుంద, పిట్లం తదితర మండలాల్లో వరి నాట్లు సాగుతున్నాయి. పోచారం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల్లో వరి నాట్లు ముమ్మరమయ్యాయి.

5.08 లక్షల ఎకరాల్లో పంటల సాగు...

జిల్లాలో వానాకాలం సీజన్‌లో ఇప్పటివరకు 5.08 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ నివేదికలు చెబుతున్నాయి. 2,75,032 ఎకరాల్లో వరి వేయగా, తర్వాతి స్థానంలో సోయా ఉంది. సోయా పంట 87,701 ఎకరాల్లో సాగైంది. పత్తి 45,864 ఎకరాలు, మక్క 47,208 ఎకరాలు, కంది 48,164 ఎకరాల్లో సాగు చేశారు. పెసర 2,198 ఎకరాలు, మినుము 1,851 ఎకరాలు, ఇతర పంటలు 578 ఎకరాలలో సాగవుతున్నాయి.

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో

రైతుల్లో ఉత్సాహం

ఇప్పటికే జిల్లాలో 2.75 లక్షల

ఎకరాల్లో నాట్లు..

ఇంకా సాగుతున్న పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement