● విద్యార్థులకు కలెక్టర్
ఆశిష్ సంగ్వాన్ ఉద్బోధ
● మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్, ఎస్పీ
బాన్సువాడ రూరల్: విద్యతోపాటు సహపాఠ్య కార్యక్రమాలు, సామాజిక అంశాలపై విద్యార్థులు దృష్టి సారించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బాన్సువాడ మండలం బోర్లం క్యాంపులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయాన్ని ఆయన బుధవారం తనిఖీ చేశారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థినులతో కాసేపు మాట్లాడారు. ఐఐటీ, జేఈఈ అడ్వాన్స్‌కు ప్రిపరేషన్ కొనసాగుతోందా? ప్రతిరోజు యోగా చేస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. సహపాఠ్య కార్యక్రమాలతో కలిగే ప్రయోజనాలు, ఎల్‌నినో ప్రభావం, సహజ ఎరువుల వినియోగంతో ప్రయోజనాలు ఏమిటని ప్రశ్నించారు. విద్యార్థినులు చక్కగా సమాధానం ఇవ్వడంతో సంతోషం వ్యక్తపరుస్తూ నోట్‌బుక్స్ బహుమతిగా అందజేశారు. అనంతరం పీఎంశ్రీలో భాగంగా ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్‌ను ప్రారంభించారు. విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలని, ప్రయోగ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అనంతరం ఎస్పీ రాజేశ్‌చంద్ర, ఆర్డీవో రవీందర్‌రెడ్డి విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆహారం నాణ్యత, రుచి, మెనూ అమలు, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డీసీవో శివరాంనాయక్, ప్రిన్సిపల్ డాక్టర్ శారద, ఎంపీడీవో ఆనంద్, తహసీల్దార్ నరేందర్ గౌడ్, గిర్ధావర్ అలీం, పంచాయతీ కార్యదర్శి రాహేలాబేగం తదితరులు ఉన్నారు.


