బాన్సువాడ : అధ్యాపకులు నిరంతరం అభ్యాసం, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించవచ్చని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రొగ్రాంను ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న విద్యావిధానాలకు అనుగుణంగా అధ్యాపకులు నూతన బోధనా పద్ధతులు అలవర్చుకోవాలని, విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించాలని దిశానిర్దేశం చేశారు. అంతకుముందు కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేశారు. రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రశంసించారు. కార్యక్రమంలో ఆర్డీవో రవీందర్‌రెడ్డి, నోడల్ అధికారి సలాం, తహసీల్దార్ జనార్దన్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్ గంగాధర్, అభివృద్ధి కమిటీ సభ్యులు ఎజాస్, దాసరి శ్రీనివాస్, బాలికల కళాశాల ప్రిన్సిపల్ అసద్ ఫారుఖ్, జూనియర్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ యాదాగౌడ్ తదితరులు ఉన్నారు.


