మోపాల్(నిజామాబాద్‌రూరల్): నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలకేంద్రంలోని బీసీ వసతిగృహం వద్దగల ముళ్లపొదల్లో బుధవారం నవజాత శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. ముడి వేసి ఉన్న బ్యాగులోనుంచి శిశువు ఏడుపులు రావడంతో అటుగా వెళ్లిన స్థానికులు గమనించి పోలీసులు, అంగన్‌వాడీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని శిశువును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చికిత్స నిమిత్తం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉందని, బుధవారమే జన్మించినట్లు నిర్ధారించినట్లు తెలిసింది. శిశువును ఎవరు వదిలి వెళ్లారనే విషయాలను వైద్య, ఆ రోగ్యసిబ్బంది ఆరా తీ స్తున్నారు. అలాగే మండలంలో నేడో, రేపో ప్రసవ తేదీలు కలిగిన గర్భిణుల వివరాలు సేకరిస్తున్నారు. మానవత్వం మంటగలిసేలా కన్న తల్లి పేగుబంధాన్ని మర్చిపోయి అప్పుడే పుట్టిన బిడ్డను వదిలించుకోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.


