● పూడికతీతతో పెరిగిన భూగర్భ జలాలు
● హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ వాసులు
బాన్సువాడ : పట్టణంలోని ఎల్లయ్య చెరువులో పూడిక పెరిగిపోవడంతో భూగర్బ జలాలు అట్టడుగుకు చేరి టీచర్స్ కాలనీ, సంగమేశ్వర కాలనీ, గూడేంగల్లీ, చైతన్య కాలనీ, శ్రీరామకాలనీల్లో ఉన్న నివాస గృహాల్లో బోర్లు ఎత్తిపోయాయి. సింగూర్ నుంచి మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో మే, జూన్, జూలై నెలల్లో ఆయా కాలనీల్లోని ప్రజలకు తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఈ నేపథ్యంలో చెరువు సుందరీకరణ పనుల కోసం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజురు చేశారు. దీంతో చెరువులో ఏడు మీటర్ల లోతుతో పూడిక తీశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఎల్లయ్య చెరువులోకి పూర్తి స్థాయిలో నీరొచ్చింది. నిండుకుండలా మారడంతో భూగర్బ జలాలు వృద్ధి చెంది ఆయా కాలనీల్లో ఎత్తిపోయిన బోర్లు నీళ్లను పోస్తున్నాయి. దీంతో ఆయా కాలనీల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.


