● జిల్లాకేంద్రంలో ఛిద్రమైన రోడ్లు
● అడుగడుగునా గుంతలు
● నరకం చూస్తున్న వాహనదారులు
● పట్టించుకోని పాలకులు
జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డు దుస్థితి
అశోక్‌నగర్ కాలనీ ప్రధాన రోడ్డుపై గుంతలు
కామారెడ్డి సాక్షి నెట్‌వర్క్ : వ్యాపార, వాణిజ్య కేంద్రంగా ఎంతో పేరున్న కామారెడ్డి పట్టణంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. పలుచోట్ల అడుగడుగునా భారీ గుంతలు ఏర్పడడంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. పట్టణంలోని విద్యానగర్ మీదుగా ఉన్న జన్మభూమి రోడ్డు విస్తరణకు నోచుకోవడం లేదు. ఈ మార్గంలో గుంతలు ఇబ్బందిపెడుతున్నాయి. వర్షమొస్తే మురికి నీరు నిలిచి దుర్గంధం వ్యాపిస్తోంది. అశోక్‌నగర్ రోడ్డుపై ఏర్పడిన గుంతలు వాహనదారులకు చుక్కలు చూపుతున్నాయి. గుంతలను తప్పించే సమయంలో అదుపుతప్పి పడిపోవడమో.. ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొట్టడమో జరుగుతున్నాయి. పంచముఖి హనుమాన్ ఆలయం మీదుగా వెళ్లే అడ్లూరు రోడ్డు.. వర్షాల కారణంగా కోతకు గురయ్యింది. దీనికి తాత్కాలిక మరమ్మతులు కూడా కరువవడంతో వాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్నారు. పట్టణంలోని ప్రధాన రోడ్లు సైతం ఛిద్రమయ్యాయి. సిరిసిల్లరోడ్, సుభాష్‌రోడ్, సైలానీబాబాకాలనీ, నిజాంసాగర్‌రోడ్, చెరువుకు వెళ్లే రోడ్, పెద్దబజార్, స్టేషన్‌రోడ్, భవానీరోడ్, కల్కీనగర్, స్నేహపురికాలనీ, వికాస్‌నగర్, వినాయక్‌నగర్, రాజీవ్‌నగర్, వాంబేకాలనీ, టీచర్స్‌కాలనీ తదితర కాలనీలలోని చాలా ప్రాంతాలలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఇప్పటికైనా పాలకులు మేల్కొని అవసరమైన మరమ్మతులు చేపట్టి, ప్రయాణం సాఫీగా సాగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.


