కుక్కలు దాడి చేశాయి
కుక్కల బెడదను నివారించాలి
మద్నూర్(జుక్కల్): మద్నూర్, డోంగ్లీ మండలాల్లోని అన్ని గ్రామాల్లో వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా నిత్యం రోడ్లు, వీధుల్లో గుంపులుగా తిరుగుతూ ప్రజలపై, పశువుల మందలపై దాడులు చేస్తున్నాయి. ఆరు బయట ఆడుకునే చిన్నారుల కుటుంబ సభ్యులు, రాత్రిపూట వివిధ పనుల నిమిత్తం వచ్చే వాళ్లు కుక్కలను చూసి భయపడుతున్నారు. ద్విచక్ర వాహనాల వెంటపడటంతో వారు ప్రమాదాలకు గురువుతున్నారు. మండలంలోని కోడిచిర గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను, ఒక బాలుడిపై గత మూడు రోజుల క్రితం దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో వారు ఆస్పత్రుల పాలయ్యారు. అలాగే మండలంలోని పెద్ద ఎక్లారలో మేకల గుంపుపై కుక్కలు దాడి చేసి 10 మేక పిల్లలను కోరికి చంపేయడంతో వేలల్లో ఆస్తి నష్టం సంభవించిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
కోళ్లఫారాలు, చికెన్ సెంటర్ల యజమానులు మృతి చెందిన కోళ్లను, వాటి వ్యర్థాలను రోడ్ల వెంబడి ఎక్కడపడితే అక్కడ పడేయడంతో వీధి కుక్కలు వాటిని తింటున్నాయి. వ్యర్థాలను రోడ్ల మీద పడేయడంతో వీధి కుక్కల సంచారం ఎక్కువైంది. గుంపులుగా తిండి కోసం వాటికి అవే ఘర్షణలు పడటంతో పాటు రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే ప్రజల మీద దాడికి పాల్పడుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి వీధి కుక్కలను బెడదను అరికట్టి, వాటి దాడుల నుంచి రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
కోడిచిరలో మూడు రోజుల కింద నలుగురిపై కుక్కలు దాడి చేశాయి. రాత్రి సమయంలో వీధి కుక్కలు వాహనాల వెంట పడుతున్నాయి. కుక్కల సంచారం ఎక్కువగా ఉండటంతో పిల్లలను బయటకు పంపాలంటే భయమేస్తుంది.
–రామ్‌పటేల్, కోడిచిర
మా ఊర్లో గత మూడు రోజుల క్రితం కుక్కలు మేకల మందపై దాడి చేసి పది మేక పిల్లలను చంపేశాయి. గ్రామంలో వీధి కుక్కల బెడదను నివారించాలి. ఆరు బయట చిన్న పిల్లలు ఆటలు ఆడుకునే సమయంలో వీధి కుక్కలు పిల్లలపై దాడి చేస్తాయోమోనని ఆందోళనగా ఉంది.
–శ్రీకాంత్, పెద్ద ఎక్లార
ఉమ్మడి మద్నూర్ మండలంలో
స్వైరవిహారం చేస్తున్న కుక్కలు
కోడిచిరలో పలువురు, పెద్ద ఎక్లారలో మేకల గుంపుపై దాడి
వీధికుక్కల నుంచి రక్షణ
కల్పించాలని వినతి


