సదాశివనగర్: సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో వివిధ ప్రాంతాల్లో పార్క్ చేసిన అంతర్ జిల్లా బైక్ దొంగల ముఠాను శనివారం మండలంలోని పద్మాజివాడి చౌరస్తా వద్ద అరెస్టు చేసినట్లు సీఐ సంతోష్‌కుమార్, ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన హన్మంత్ రాజు అనే వ్యక్తి తన బైక్‌ను గత నెల 24న రాత్రి ఇంటి ఎదుట పార్క్ చేయగా మరుసటి రోజు కనిపించకుండా పోయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ రెండు పోలీస్ ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి దర్యాప్తును ప్రారంభించారు. పద్మాజీవాడి చౌరస్తా వద్ద పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని గమనించి తప్పించుకునేందుకు యత్నించిన ఐదుగురు నిందితులను పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితులు పార్క్ చేసిన బైక్‌లను దొంగతనాలకు పాల్పడినట్లు నేరం ఒప్పుకున్నారు. నిందితులు ఇమ్రాన్, అద్నా ఖాన్ పార్కింగ్ చేసిన బైక్‌లను గుర్తించి దొంగిలించేవారు. వాటిని జుబేర్, అయాన్, సచిన్‌లకు విక్రయించేవారు. వీరు ప్లేట్ నంబర్లను మార్చి వినియోగించేవారు. అందులో భాగంగానే దొంగిలించిన్ ఓ బైక్‌ను హైదరాబాద్‌లో విక్రయించేందుకు నిందితులు తీసుకెళ్తుండగా పోలీసులు పద్మాజీవాడి చౌరస్తా వద్ద పట్టుకున్నారు. నిందితుల నుంచి దొంగిలించిన నాలుగు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన డీఎస్పీ శ్రీనివాస్ రావు, సీఐ సంతోష్‌కుమార్, ఎస్సైలు పుష్పరాజ్, సిద్ధిఖీ, సిబ్బంది అజహర్, ఫరూక్, ఏఆర్‌పీసీ శంకర్, సీసీఎస్ బృందం సభ్యులు రవి, గణపతిలను ఎస్పీ అభినందించారు.


