● నిందితుల్లో ఒకరు మైనర్
● 2.402 కిలోల
ఎండు గంజాయి స్వాధీనం
గాంధారి(ఎల్లారెడ్డి): గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తితోపాటు బాలుడిని శనివారం అరెస్టు చేసి 2.4 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. పక్కా సమాచారం మేరకు గాంధారి మండల కేంద్రం నుంచి చద్మల్ వెళ్లే రహదారిలో అయ్యప్ప ఆలయం వద్ద ఇన్‌చార్జి ఎస్సై నరేశ్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. అదే సమయంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న నాగ్లూర్ తండాకు చెందిన మాథుర్‌సింగ్(55), ఓ బాలుడిని తనిఖీ చేయగా ఎండు గంజాయి లభించింది. అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా గంజాయిని తండా నుంచి రవాణా చేసి మండల కేంద్రంతోపాటు కామారెడ్డి పట్టణంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్ పరిసరాల్లో విక్రయించి మిగిలిన ప్యాకెట్లను హైదరాబాద్‌కు తరలించి విక్రయించాలని పథకం వేసుకున్నట్లు తెలిపారు. మాథుర్ సింగ్‌ను రిమాండ్ తరలించి, బాలుడిని జువైనెల్ కోర్టులో హాజరు పరచనున్నట్లు సీఐ తెలిపారు. గంజాయి రవాణాను అడ్డుకోవడంలో చాకచక్యంగా పనిచేసిన సీఐ సంతోష్ కుమార్, ఎస్సైలు నరేశ్, పుష్పరాజ్, ఏఎస్సై ప్రకాశ్, సిబ్బంది సంజయ్, వీర ప్రసాద్, బంటిలాలును ఎస్పీ రాజేశ్‌చంద్ర అభినందించినట్లు తెలిపారు.


