పాముకాటుతో ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

పాముకాటుతో ఒకరి మృతి

Aug 9 2026 2:04 AM | Updated on Aug 9 2026 2:04 AM

నిజాంసాగర్‌: మహమ్మద్‌నగర్‌ మండలం గున్కుల్‌ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 1న పాము కాటుకు గురైన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం వేకువజామున మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గున్కుల్‌ గ్రామానికి చెందిన చాకలి సాయిలు(35) రోజు మాదిరిగానే భార్య, పిల్లలతో కలిసి నిద్రించాడు. ఈ నెల 1న ఇంట్లో నిద్రించిన సమయంలో అర్ధరాత్రి వేళ సాయిలు చేతికి పాము నాలుగైదు సార్లు కాటు వేసింది. తన పక్కనే నిద్రిస్తున్న కుమారుడికి పాముతాకడంతో నిద్రలేచాడు. అప్పటికే తన పక్కనే ఉన్న పామును చూసిన కుమారుడు తండ్రిని నిద్రలేపాడు. సాయిలు నిద్రలేచి కర్రతో పామును చంపేసి ఊరి చివరన పారేశాడు. ఇంటికొచ్చిన కొద్దిసేపటికి సాయిలు చేతికి పాము కాట్లు ఉండటాన్ని గమనించి కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు వెంటనే చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆస్పత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితికి చేరుకున్న సాయిలుకి ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందించారు. అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించడం.. చికిత్సకు సహకరించకపోవడంతో శుక్రవారం రాత్రి సాయిలును కుటుంబీకులు ఇంటికి తీసుకొచ్చారు. శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబం కావడం.. ఇంటి పెద్ద దిక్కును పాముకాటేసి విధి వంచించడంతో మృతుడి భార్య మంజుల, కుమార్తె మానస, కుమారుడు అంజి బోరున విలపించారు. సాయిలు అంత్యక్రియలకు గ్రామస్తులు చందాల రూపంలో డబ్బులు విరాళంగా అందజేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement