సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఎల్‌నినోను ఎదిరించిన వరుణుడు ప్రకృతిని పులకింపజేశాడు. జిల్లా అంతటా సాధారణానికి మించి కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలే కాదు ప్రాజెక్టులకూ జలకళ వచ్చింది. ఇప్పటికే వందలాది చెరువులు అలుగులు పారుతున్నాయి. పోచారం ప్రాజెక్టు, సింగీతం రిజర్వాయర్, కల్యాణి ప్రాజెక్టులకు భారీ వరద రావడంతో అలుగెత్తాయి. నిజాంసాగర్ ప్రాజెక్టుకూ వరద వస్తోంది. దీంతో జిల్లా అంతటా ఖరీఫ్ సాగు పనులు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే జిల్లాలో 5.05 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో 2.70 లక్షల ఎకరాల్లో వరి ఉంది. ఈసారి ఎల్‌నినో ప్రభావం ఉంటుందని, వరి వేయొద్దని ప్రభుత్వం విస్తృత ప్రచారం నిర్వహించింది. అయితే, జిల్లాలో ఆలస్యంగానైనా కురిసిన భారీ వర్షాలతో రైతులు వరినాట్లు వేస్తూనే ఉన్నారు. 3 లక్షల ఎకరాలు దాటొచ్చని భావిస్తున్నారు. కాగా, జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో అడవి పచ్చబడింది. అడవుల్లో వాగులు ప్రవహిస్తుండటంతో వన్యప్రాణుల దాహార్తి సమస్య తీరింది. రాజంపేట మండలం కొండాపూర్ అడవిలో పారుతున్న వాగు జలపాతాన్ని తలపిస్తోంది. వారం రోజులుగా పరవళ్లు తొక్కుతోంది. ఎత్తుగా ఉన్న రాళ్లపై నుంచి పడుతుండటంతో ఆకట్టుకుంటోంది. తాడ్వాయి మండలం సంతాయిపేట అటవీ ప్రాంతంలో ఉన్న భీమేశ్వర వాగు పొంగి ప్రవహిస్తోంది. ఇక్కడ చెక్‌డ్యాం పైనుంచి, తర్వాత ఎత్తయిన బండలపై నుంచి వాగు పారుతుండటంతో జలపాతంలా కనబడుతోంది. పోచారం ప్రాజెక్టు నాలుగైదు రోజులుగా ఉప్పొంగుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 10 టీఎంసీలు దాటింది. నాలుగైదు భారీ వర్షాలు కురిస్తే ప్రాజెక్టు నిండుతుందని భావిస్తున్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న సింగీతం రిజర్వాయర్ నుంచి పారుతున్న నీరు ఆకట్టుకుంటోంది. పాల్వంచ వాగు, లొట్టివాగు, ఎడ్లకట్టవాగు, లెండి వాగు, పెద్దవాగు..ఇలా వాగులన్నీ పారుతుండడంతో అంతటా జలకళ సంతరించుకుంది. ఇదే సమయంలో ఖరీఫ్ పంటలతో ఎటు చూసినా పచ్చదనమే కనబడుతోంది.
అబ్బురపరుస్తున్న అటవీ అందాలు
కరుణించిన వరుణుడు..
పరుగులు తీస్తున్న వాగులు
అలుగులు పోస్తున్న చెరువులు, ప్రాజెక్టులు
పచ్చదనం పరచుకున్న పొలాలు


