నిజామాబాద్ అర్బన్ / కామారెడ్డి : నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే పరమావధి గా అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేద్దామని శాసనసభ్యులు సూచించారు. నిజామాబాద్ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివా రం ఇన్‌చార్జి కలెక్టర్ భవేశ్ మిశ్రా అధ్యక్షతన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎ మ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ రూరల్, అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేశ్ రెడ్డి హాజరుకాగా, కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వర్చువల్ విధా నం ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఎస్సారెస్పీ, నిజాంసాగర్, పోచారం, కౌలాస్‌నాలా తదితర జలాశయాలలో నీటి నిల్వల స్థితిగతులు, ఆయకట్టుకు సాగు నీటిని అందించే వెసులుబాటు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక తదితర అంశాలపై చర్చించారు.
ఆరుతడిపై అవగాహన కల్పించాలి
యాసంగిలో నిర్వహించాల్సిన సమావేశాన్ని ఎల్‌ని నో ప్రభావంతో ఖరీఫ్ సీజన్‌లోనే ఏర్పాటు చేసిన ట్లు ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గుర్తుచేశారు. మున్ముందు వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలున్నందున వరి నాటేసిన రైతులు నష్టపోకుండా అధికారులు చొరవ చూపాలన్నారు. ఇంకా పంట వేసుకోని రైతులు ఆరుతడి పంటలు, కూరగాయలు, ఆయిల్ పామ్ సాగు చేసేలా అవగాహన కల్పించాలని వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల, రెవెన్యూ తదితర శాఖల అధికారులకు సూచించారు. తుపాను ప్రభావంతో ఇప్పటి వరకు కొంతవరకు వర్షాలు కురిసినప్పటికీ, ఎల్‌నినో ప్రభావంతో ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని నిజామాబాద్ ఇన్‌చార్జి కలెక్టర్ భవేశ్ మిశ్రా పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద నిజామాబాద్ జిల్లాలో లక్షా 15 వేల ఆయకట్టు ఉందని, జలాశయంలో ప్రస్తుతం 10.78 టీఎంసీల నీరు నిలువ ఉన్నందున మూడు నుంచి నాలుగు తడులు అందించేందుకు అవకాశం ఉందన్నారు.
విస్తృతంగా జలసిరి..
నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతున్న సింగూర్ రిజర్వాయర్‌కు మరమ్మతులు చేపడుతున్న నేపథ్యంలో సామర్థ్యం మేరకు నీటిని నిలువ ఉంచే పరిస్థితి లేదని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ప్రస్తుతం నిలువ ఉన్న 4.140 టీఎంసీల నీటిని తాగునీటి సరఫరాకే వినియోగించాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ నీరు 60 నుంచి 90 రోజులకే సరిపోతుందని, ఈ నేపథ్యంలో వర్షాలు కురిస్తే మరో 4 టీఎంసీల వరకు వరద జలాలను సింగూర్‌లో నిలువ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇలా చేస్తే మూడు జిల్లాలకు వచ్చే ఐదారు నెలల వరకు తాగునీటి సరఫరాకు ఇబ్బంది ఉండదని సూచించారు. భూగర్భ జలాలు గణనీయంగా వృద్ధి చెందేలా జిల్లాలో జలసిరి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నామని తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని కౌలాస్‌నాలా, పోచారం ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టాన్ని సంతరించుకున్నాయని, నిర్దేశిత ఆయకట్టుకు సాగు నీటిని అందించవచ్చని స్పష్టం చేశారు.
ఆరుతడి పంటలు, ఆయిల్ పామ్
సాగుపై అవగాహన కల్పించాలి
నీటిపారుదల సలహా మండలి
సమావేశంలో ప్రభుత్వ సలహాదారు పోచారం, ఎమ్మెల్యేలు
వర్చువల్‌గా పాల్గొన్న కలెక్టర్ సంగ్వాన్


